logo

నిధులున్నా.. ప్రగతి శూన్యం

నగరంలోని కేవీఆర్‌ మహిళా జూనియర్‌ కళాశాలను పాలకులు గాలికొదిలేశారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రెండెకరాలు కేటాయించినా ఆ భూమి కళాశాలకు దక్కేలా చేయడంలో అధికారులు విఫలమయ్యారు.

Published : 01 Jun 2023 02:34 IST

కేవీఆర్‌ జూనియర్‌ కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
మురిగిపోయిన రూ.2.95 కోట్లు

ఈనాడు, కర్నూలు : నగరంలోని కేవీఆర్‌ మహిళా జూనియర్‌ కళాశాలను పాలకులు గాలికొదిలేశారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రెండెకరాలు కేటాయించినా ఆ భూమి కళాశాలకు దక్కేలా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా విద్యాలయం అభివృద్ధికి కేటాయించిన నిధులు మురిగిపోయే పరిస్థితి.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళలకు ఉన్నత విద్య అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో 1958లో నగరంలో  కళాశాలను ప్రారంభించారు. అనంతరం కేవీఆర్‌ డిగ్రీ కళాశాలగా విస్తరించారు. 1996లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌, డిగ్రీ కళాశాలలను విభజించి ప్రత్యేకంగా ప్రాంగణాలు, పాలన వ్యవస్థలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కర్నూలులోని కేవీఆర్‌ మహిళా జూనియర్‌ కళాశాలకు భూకేటాయింపులో మాత్రం అంతులేని జాప్యం జరిగింది. 2018లో డిగ్రీ కళాశాల ప్రాంగణానికి చెందిన 13 ఎకరాల్లో రెండెకరాలను జూనియర్‌ కళాశాలకు కేటాయించారు. రెవెన్యూ అధికారులు సరిహద్దులు గుర్తించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అందులో భాగంగా ప్రాంగణంలో ఉన్న భవనాల్లోని 14 గదులు జూనియర్‌ కళాశాలకు దక్కాయి. మరోవైపు డిగ్రీ కళాశాల ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదు. జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌, కర్నూలు సివిల్‌ ఫోరమ్‌ (కె.సి.ఎఫ్‌.) ప్రతినిధులు కలెక్టర్‌, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది.

తాఖీదులు జారీ చేసినా..

కేవీఆర్‌ మహిళా జూనియర్‌ కళాశాలకు స్థలం, భవనాలు అప్పగించడంలో నిర్లక్ష్యంపై డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాలు ధిక్కరించారని అందులో పేర్కొన్నారు. భూమిని జూనియర్‌ కళాశాలకు అప్పగించమని ఆదేశిస్తే ‘మా పనికి అంతరాయం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ కలెక్టర్‌కు సమాధానం ఇవ్వడం.. విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఇందిరాశాంతికి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

వసతి కరవు

ఆడపిల్లలను వేరే ప్రాంతాలకు పంపి చదివించే తల్లిదండ్రులు ఆయా విద్యా సంస్థల్లో వసతిగృహ సదుపాయం ఉందా? లేదా? అన్న విషయాలు పరిశీలిస్తారు. కేవీఆర్‌ కళాశాలలో 1,200 మంది విద్యార్థినులకు సరిపడా వసతిగృహం అందుబాటులో ఉంది. అయినప్పటికీ 2012 నుంచి జూనియర్‌ కళాశాల విద్యార్థినుల్లో ఒక్కరికి కూడా వసతి కల్పించడం లేదు. ఫలితంగా ఒకప్పుడు 2,500 మంది వరకు విద్యార్థినులు ఉన్న జూనియర్‌ కళాశాలలో ప్రస్తుతం 1,500 మంది మాత్రమే ఉంటున్నారు.

వృథాగా నిధులు

మహిళా జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో భవనాల నిర్మాణం కోసం నాబార్డు నిధులు రూ.65 లక్షలు ఒకసారి, రూ.2.3 కోట్లు మరోసారి మంజూరయ్యాయి. భూ వివాదం కారణంగా ఆయా నిధులను ఉపయోగించుకోకపోవడంతో రూ.2.95 కోట్లు మురిగిపోయాయి. ఫలితంగా కళాశాల అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. ప్రస్తుతం నాడు-నేడు పనులు మాత్రం జరుగుతున్నాయి.

* ఈ విషయమై కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఇందిరాశాంతి మాట్లాడుతూ మహిళా డిగ్రీ కళాశాల ప్రస్తుతం క్లస్టర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో ఉందని చెప్పారు. ఆ విశ్వవిద్యాలయ వీసీ, ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ అనుమతి తీసుకుని జూనియర్‌ కళాశాలకు కేటాయించిన భూమిని అప్పగిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని