logo

ఒట్టి మాటలే మిగిలాయి!

ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017లో పత్తికొండ వచ్చారు. పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  అధికారంలోకి వచ్చిన వెంటనే పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రజల సాక్షిగా తెలిపారు.

Published : 01 Jun 2023 02:34 IST

నెరవేరని ముఖ్యమంత్రి హామీలు
నేడు పత్తికొండకు రాక

పత్తికొండ టమాటా మార్కెట్లో పంట ఉత్పత్తులు (పాత చిత్రం)

పత్తికొండ, పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే : ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017లో పత్తికొండ వచ్చారు. పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  అధికారంలోకి వచ్చిన వెంటనే పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రజల సాక్షిగా తెలిపారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా పత్తికొండలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పత్తికొండలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు నాటి మాటలను గుర్తు చేస్తున్నారు.

పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో వేల హెక్టార్లలో అన్నదాతలు టమోటా సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయాల్లో గిట్టుబాటు ధర లేక సరకును రోడ్డుపాలు చేస్తున్నారు. డివిజన్‌ కేంద్రమైన పత్తికొండలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాళాల లేక ఏటా సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మంది పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు సాంకేతిక విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. పత్తికొండలో పూర్తిస్థాయిలో సాగు నీరు, పరిశ్రమలు లేక చాలా మంది రైతులు, కూలీలు వలస వెళ్తున్నారు.

టమాటా గుజ్జే మిగిలింది

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 22,933 ఎకరాల్లో టమాటా సాగు చేస్తారు. పత్తికొండ ప్రాంతంలో సాగునీటి వనరులున్న రైతులే కాదు.. వర్షాధారంగా అధిక శాతం మంది అన్నదాతలు ఏటా టమాట సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 3.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పంట ఉత్పత్తులను సాధిస్తున్నారు. పంట చేతికందే సమయానికి ధరల పతనం, అధిక వర్షాలు, తెగుళ్లు.. ఇలా పలు రకాల కారణాలతో ప్రతి రైతు నష్టపోతూనే ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా ఈ ప్రాంతంలో టమాటా గుజ్జు (జ్యూస్‌) పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడంతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. దీని కోసం ఇక్కడి రైతులతోపాటు ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నా పరిశ్రమ కలగానే మిగిలింది. గత ఎన్నికలకు ముందు పత్తికొండ ప్రాంతానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే టమాటా గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. నాలుగేళ్లవుతున్నా అతీగతీ లేదు.

మాటల్లోనే చల్లదనం

ప్రతి మండల కేంద్రంలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మిస్తామని చెప్పిన విషయం సీఎంకు గుర్తు ఉందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట నష్టం జరిగిన సమయంలో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు నీటి మూటలయ్యాయని అన్నారు.

* పత్తికొండలో బీసీ బాలికల వసతిగృహం మంజూరు చేస్తామని చెప్పారని, దానిని పట్టించుకోలేదని పలువురు   ఆవేదన వ్యక్తం చేశారు.

సాంకేతికత కలే

వెనుకబడిన పత్తికొండ ప్రాంతంలో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ఇక్కడ పాలిటెక్నికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రజా సంకల్పయాత్ర, ఎన్నికల ప్రచార సమయాల్లో పత్తికొండలో నిర్వహించిన బహిరంగ సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎలాంటి పరిశ్రమలు లేని ఈ ప్రాంతంలో సాంకేతిక విద్య ద్వారా స్థానిక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని