logo

రైతు భరోసా కార్యక్రమం.. నిర్వహణ భారం

ఐదో ఏడాది మొదటి విడత రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి పత్తికొండలో లాంఛనంగా ప్రాంభించనున్నారు.

Published : 01 Jun 2023 02:34 IST

రూ.3 కోట్లకు పైగా వ్యయం
రూ.80 లక్షలే మంజూరు

రైతులకు ఇచ్చే కండువాలను మండలాలకు పంపేందుకు  సిద్ధం చేస్తున్న సిబ్బంది

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఐదో ఏడాది మొదటి విడత రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి పత్తికొండలో లాంఛనంగా ప్రాంభించనున్నారు. దీంతోపాటు మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం విడుదల చేయనున్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.80 లక్షలు ఏమూలకూ చాలవని,  రూ.3 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమ నిర్వహణ అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. సభా వేదికకే రూ.కోటి మేర ఖర్చవుతుందని, కొంత అడ్వాన్సు రూపంలో అధికారులు చెల్లించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 40 వేల మంది రైతులను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరితోపాటు స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలనూ రప్పిస్తున్నారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, ఆదోని, కృష్ణగిరి, వెల్దుర్తి తదితర మండలాల నుంచి వేలాది మంది రైతులను కార్యక్రమానికి తరలించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను 600కు పైగా వినియోగిస్తున్నారు.  రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ కార్యక్రమంలో 22 వేల మంది రైతులకు కండువాలను పంపిణీ చేయనున్నారు. ఆరు వేల మీటర్ల ఆకుపచ్చ కండువాలను సిద్ధం చేశారు. వీవీఐపీలకు 1,300 కండువాలు తెప్పించారు. రైతులకు ఇచ్చే కండువాలు ఒకటి రూ.20 చొప్పున, వీఐసీలకు పంపిణీ చేసే కండువాలు రూ.50 ప్రకారం వెచ్చించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కండువాలకు రూ.5.05 లక్షలు ఖర్చయ్యింది. కర్నూలులో ఓ క్లాత్‌ సెంటర్‌లో అప్పుగా తీసుకువచ్చారు. నిధులు విడుదలయిన వెంటనే పైకం చెల్లిస్తామని వ్యవసాయధికారులు దుకాణ యజమానికి నచ్చజెప్పి కండువాలను తెప్పించడానికి  ఆపసోపాలు పడ్డారు. ఫ్లెక్సీలకు రూ.లక్షలు ఖర్చయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని