logo

ఆంక్షల వలయం.. అవస్థలమయం

పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే పోలీసులు ఆంక్షలు విధించారు.

Published : 02 Jun 2023 02:00 IST

అడుగడుగునా బారికేడ్ల ఏర్పాటు 
రహదారులపై తిరగకుండా పోలీసుల నిఘా
ఏరులై పారిన మద్యం

పత్తికొండ, మద్దికెర, పత్తికొండ గ్రామీణం, పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. దుకాణాలను మూసివేయించారు. బారికేడ్లు ఏర్పాటుచేసి జనాలు రాకుండా అడ్డుకున్నారు. అత్యవసర పనులకు వెళ్లాలని విన్నవించినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పలువురు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ప్రధాన మార్గంలోని వ్యాపార దుకాణాలను పోలీసులు మూసివేయించారు. మరోవైపు సభలో ఓ యువకుడు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. జగనన్నా.. డీఎస్సీ, కానిస్టేబుల్‌ తదితర నోటిఫికేషన్లు లేవు అని పేర్కొన్నారు. ఇకనైనా స్పందించాలని కోరారు.

దివ్యాంగుల ఎదురుచూపు

ముఖ్యమంత్రి కోసం గురువారం ఉదయం 7 గంటలకే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల దగ్గర, సీఎం బహిరంగ సభకు వెళ్లే మార్గాల్లో దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు వేచి చూశారు. వీరిని పోలీసులు అనుమతించలేదు. సభ పూర్తయ్యేంత వరకు సీఎం దివ్యాంగుల వినతిపత్రాలు తీసుకోలేదు. ప్రజలకు నమస్కారం చేసి  తిరిగి పయనమవగా ఎమ్మెల్యే శ్రీదేవి దివ్యాంగుల సమస్యను సీఎంకు వివరించారు. స్పందించిన ఆయన అధికారులకు సూచనలు చేయడంతో ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ ప్రత్యేక వాహనంలో దివ్యాంగులను హెలిప్యాడ్‌ వద్దకు తీసుకెళ్లి సీఎంతో మాట్లాడించారు.


దారులన్నీ బంద్‌

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణంలోని అన్ని దారులను పోలీసులు మూసివేశారు. గుత్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డు నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, చక్కరాళ్ల రోడ్డు, తేరుబజార్‌, పోస్టాఫీసు, ఎంపీడీవో కార్యాలయం.. కొత్తపేట మసీదు లైన్‌, గుత్తి సర్కిల్‌, ఊరివాకిలి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్నూలు, ఆదోని తదితర రహదారులు మూసివేయడంతో స్థానిక ప్రజలతోపాటు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు.


సీఎం ప్రసంగం.. వెనుదిరిగిన జనం

త్తికొండలో ముఖ్యమంత్రి సభకు రైతులు, పొదుపు సంఘాల మహిళలు, ఉపాధి కూలీలను బలవంతంగా తరలించారు. సభ ప్రారంభంకాగానే జనం వెళ్లిపోవడంతో వెలవెలబోయింది. పత్తికొండలోని సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి అన్ని శాఖల అధికారులు, పార్టీ నాయకుల ఒత్తిళ్లతో జనం తరలివచ్చినా అక్కడ ఉండలేకపోయారు. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడడం మొదలు పెట్టగానే సభ నుంచి వేలాది మంది బయటకు వెళ్లేందుకు వరస కట్టారు. సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించగానే పెద్దఎత్తున గేట్లు దూకి బయటకు వెళ్లిపోవడం గమనార్హం.


నడక యాతన

ఆలూరు గ్రామీణ, ఆస్పరి, న్యూస్‌టుడే: సీఎం సభకు ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం బస్సులు ఏర్పాటు చేసింది. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను సభా ప్రాంగణానికి రెండు కి.మీ. దూరంలోనే ఆపేశారు. ఫలితంగా సభకు వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. రెండు కి.మీ. దూరంలోనే బస్సులు ఆపేయడంతో అక్కడినుంచి మండుటెండలో సభ ప్రాంగణానికి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికలాంగులు, మహిళలతోపాటు వచ్చిన చిన్నారులు అవస్థలు పడ్డారు.


పోలీసుల అదుపులో నాయకులు

చ్చిన హామీలు నెరవేర్చాలంటూ సీపీఐ, జనసేన, ఎమ్మార్పీఎస్‌, కురువ సంఘం నాయకులు ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ మదారి, మదాసి కురువ సంఘం ఆధ్వర్యంలో పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


డబ్బుల వసూలుపై ఆగ్రహం

ముఖ్యమంత్రి సభకు జన సమీకరణ కోసం ఉపాధి మేట్ల నుంచి డబ్బులు వసూలు చేయడం గొడవకు దారి తీసింది. ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని వైకాపా నాయకులు బెదిరిస్తూ వారి నుంచి మద్యం పంపిణీకి అవసరమైన డబ్బులు వసూలు చేసేందుకు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. తామెందుకు ఇవ్వాలని కొందరు మేట్లు నాయకులతో గొడవకు దిగినట్లు సమాచారం. అయినా వదిలి పెట్టకుండా దాదాపు రూ.60 వేలు వసూలు చేశారని మేట్లు వాపోతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని