logo

యాంత్రీకరణకు పాస్‌పోటు

వ్యవసాయ యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రైతు సంఘాలకు 40 శాతం రాయితీపై డ్రోన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 02 Jun 2023 02:00 IST

కిసాన్‌ డ్రోన్లకు నిబంధనల అడ్డు
వేధిస్తున్న పైలెట్ల కొరత...  
వ్యక్తిగత రాయితీలోనూ కోత

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వ్యవసాయ యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రైతు సంఘాలకు 40 శాతం రాయితీపై డ్రోన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూపొందించిన నిబంధనలు కఠినంగా ఉండటంతో అన్నదాతలకు యాంత్రీకరణ ఉపకరణాలు అందని ద్రాక్షగా మారింది. సాధారణ పిచికారీ యంత్రాలతో పోలిస్తే డ్రోన్లతో పురుగు మందులను పంటలపై చల్లినప్పుడు 30 శాతం ఆదా అవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వాటిని తీసుకునేందుకు గ్రూపు సభ్యుల్లో తప్పనిసరిగా ఒకరికి పాస్‌పోర్టు ఉండాలన్న నిబంధన పథక లక్ష్యానికి అడ్డంకిగా మారింది. నాలుగు నెలలు దాటినా ఒక్క కిసాన్‌ డ్రోన్‌ యూనిట్‌ కూడా మంజూరు చేయలేదు. ప్రభుత్వం చెప్పే మాటలకు.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది.

పాస్‌పోర్టుతో సమస్యలు

ఉమ్మడి కర్నూలు జిల్లాకు తొలి విడతగా 159 డ్రోన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికి ఇద్దరు పైలెట్లను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించినా అర్హులైనవారు లభించడం లేదు. ఫలితంగా మండలానికి ఒక్కరు కూడా దొరకడం కష్టంగా మారింది. ఆదోని 3, కల్లూరు 1, ఆలూరు 1, తుగ్గలి 1, పెద్దకడబూరు 1 కలిపి మొత్తం ఏడుగురిని ఎంపిక చేశారు. 21 మండలాలకు పాస్‌పోర్టు కలిగిన వారు దొరకలేదు. గత నవంబరు నుంచి ఇప్పటివరకు గుంటూరు లామ్‌ఫామ్‌లో పలుమార్లు శిక్షణ జరగ్గా.. కర్నూలు జిల్లా నుంచి ఏడుగురు మాత్రమే శిక్షణ పొందారు. నంద్యాలలో ఏడెనిమిది మందికి మించి లేరు. కిసాన్‌ డ్రోన్ల నిర్వహణకు పాస్‌పోర్టు కలిగిన వారిని పైలెట్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించడంతో పాస్‌పోర్టు కలిగిన వారు దొరకడం లేదు.

మండలానికి మూడు చొప్పున..

కర్నూలు వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో ఐదు మండలాలతోపాటు ఓర్వకల్లుతో కలిపి ఆరు మండలాలున్నాయి. ఒక్కో మండలానికి మూడు చొప్పున 18 డ్రోన్లు మొదటి విడతగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. రైతు సంఘాల ఏర్పాటుకు దరఖాస్తులు కోరగా.. వ్యవసాయ నిబంధనల మేరకు అన్నదాతల్లో నాలుగైదు మండలాల్లో ఎవరికీ పాస్‌పోర్టు లేకపోవడంతో ఏ గ్రూపు సభ్యులు వాటికి దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. సంఘం ఏర్పడిన ఐదుగురు రైతుల్లో ఒక్కరికి కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాలి. యాంత్రీకరణ సాగుపై కొందరు రైతులకు ఆసక్తి ఉన్నా వాటిని పొందలేకపోతున్నారు. మరోవైపు రైతు సంఘాల సభ్యుల్లో పాస్‌పోర్టు ఉన్నవారి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.

దరఖాస్తు చేయిస్తున్నాం

రైతుల సంఘాల రిజిస్ట్రేషన్‌ సమయంలో సభ్యుల్లో పాస్‌పోర్టు ఉన్న వారి సంఖ్య నమోదు చేయాలని, సంఘంగా ఏర్పడిన సభ్యులకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయిస్తున్నామని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. తద్వారా భవిష్యత్తులో వారికే ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఎంపిక చేసిన సంఘాల సభ్యులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పిస్తామని.. వ్యవసాయ యాంత్రీకరణ వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంటున్నారు.


ఇష్టానుసారంగా కుదించారు..  

రైతు సంఘాలకు వ్యవసాయ శాఖ అందించాలనుకున్న కిసాన్‌ డ్రోన్‌ (స్ప్రేయర్‌) యూనిట్‌ ధర రూ.10 లక్షలు ఉంది. అందులో పది శాతం రైతు వాటా, 40 శాతం.. అంటే రూ.4 లక్షల వరకు రాయితీ, మిగిలిన 50 శాతం బ్యాంకుల ద్వారా రుణం తీసుకోవాల్సి ఉంది.

వ్యవసాయ పట్టభద్రులకు కిసాన్‌ డ్రోన్‌ యూనిట్‌ ధర రూ.10 లక్షలు కాగా.. 50 శాతం.. రూ.5 లక్షలు రాయితీగా మొదట ప్రకటించారు. ఇప్పుడేమో వ్యక్తిగతంగా రాయితీలు ఇవ్వడం కుదరదని.. రైతు సమూహాలకు మాత్రమే ఇస్తామంటూ 40 శాతం రాయితీకే పరిమితం చేశారు. ఫలితంగా వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే వ్యవసాయ పట్టభద్రులకు డోన్‌ స్ప్రేయర్లు రానట్టే..  పది శాతం రైతుల వాటా, 40 శాతం బ్యాంకు రుణం పొందవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు