logo

ఐచ్ఛికం.. కష్టకాలం

ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల బదిలీలు ప్రహసనంగా మారాయి. సాధారణ విధానంలో కాకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

Published : 03 Jun 2023 01:57 IST

ఆన్‌లైన్‌లో నమోదుకు ఇబ్బందులు
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల ఆందోళన

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం: ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల బదిలీలు ప్రహసనంగా మారాయి. సాధారణ విధానంలో కాకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే పాఠ్యాంశ ఉపాధ్యాయుల బదిలీలు తక్కువగా ఉంటాయి. ఎస్జీటీల విషయానికొస్తే సీనియారిటీ ప్రకారం వారికి వచ్చిన బదిలీ పాయింట్ల ఆధారంగా వారికో సంఖ్య కేటాయిస్తారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు 1,759 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. 


సేవ్‌ ఆప్షన్‌ లేకుండా..

బదిలీ ప్రక్రియలో భాగంగా తన సంఖ్య 1,000 వరకు వచ్చిన ఉపాధ్యాయుడు కంప్యూటర్‌ ముందు కూర్చుని ప్రక్రియ పూర్తి చేసేందుకు గంటల కొద్దీ సమయం పడుతుంది. అదీ వేగంగా చేస్తేనే సాధ్యం. కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువగా ఉంటే ఇబ్బందులే..  వివరాలు నమోదు చేసే సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం, సాంకేతిక లోపం ఏర్పడితే మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా డేటా పోయి తొలి నుంచి ప్రారంభించాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎస్జీటీలు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఈనెల 5వ తేదీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ (తెలుగు, ఉర్దూ) ఉపాధ్యాయులు అంతా కలిస్తే వేల మంది కంప్యూటర్‌లో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోనున్నారు. ఇలా అందరూ ఒకేసారి ఎంపిక చేసుకుంటే సర్వర్‌ పనిచేయక ఇబ్బందులు ఏర్పడుతాయి. సేవ్‌ ఆప్షన్‌ లేకుండా ప్రక్రియలో పాలుపంచుకోవడం కనాకష్టంగా మారింది.


సాధారణం లేకుండా సతాయిస్తూ..

సాధారణ బదిలీలు అయితే ఎంతో పారదర్శకంగా క్రతువు పూర్తి చేసే అవకాశమున్నా ప్రభుత్వం ఆ విధానం వైపు మొగ్గు చూపలేదు. సాధారణ విధానంలో సీనియార్టీ ప్రకారం వరుసగా పిలుస్తుంటారు. తెర మీద కనిపించే ఖాళీల్లో తమకు కావాల్సిన స్థానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. నిమిషాల్లో పని పూర్తవుతుంది. ప్రభుత్వానికి వ్యయం ఉండదు. కొద్ది రోజుల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. ప్రభుత్వం ఎంచుకున్న వెబ్‌ కౌన్సెలింగ్‌తో ఉపాధ్యాయులు ఆందోళనలకు  గురవుతున్నారు.


తప్పని ఇక్కట్లు

* ఎస్జీటీల్లో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయునికి 1,200 సంఖ్య వస్తే.. సదరు ఉపాధ్యాయుడు వెబ్‌ విధానంలో పాఠశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఒకటో నంబరు నుంచి మొదలు పెట్టి 1,200 పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. ఒక మండలంలో పనిచేసే ఉపాధ్యాయుడికి ఆ మండలంలో ఉండే 30 నుంచి 40 పాఠశాలల వరకు అవగాహన ఉంటుంది. ఇందులో ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో సులభంగా తెలుసుకోగలుగుతారు. ఆ ప్రకారం బడిలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూసుకుని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
* ప్రస్తుతం 1,100 సంఖ్య వచ్చిన ఉపాధ్యాయుడి విషయానికొస్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 మండలాల్లో ఉన్న 1,100 పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో పనిచేసే ఉపాధ్యాయుడికి అదే సంఖ్య వస్తే అతను తన మండలం నుంచి మొదలుపెట్టి ఆత్మకూరు ఒకటి, నందికొట్కూరు రెండు, బనగానపల్లి మూడు, కర్నూలు నాలుగు, గూడూరు ఐదు చొప్పున ఇలా ప్రాధాన్యత సంఖ్యలు 53 మండలాల్లో కలిపి 1,100 వరకు ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన 1700 నంబరు వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని