logo

అనుకూలతలున్నా.. నిర్లక్ష్యమే

కర్నూలు రైల్వేస్టేషన్‌కు మరిన్ని రైళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. అధికారులు, పాలకులు ఆమేర దృష్టి సారించడం లేదు.

Published : 03 Jun 2023 01:57 IST

కర్నూలుకు రైళ్ల  పొడిగింపుపై దృష్టేదీ?
పట్టించుకోని పాలకులు

ఈనాడు, కర్నూలు: కర్నూలు రైల్వేస్టేషన్‌కు మరిన్ని రైళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. అధికారులు, పాలకులు ఆమేర దృష్టి సారించడం లేదు. రైల్వేలపై పెద్దగా భారం పడకుండా, కొత్తవి అవసరం లేకుండా సమీప స్టేషన్లకు వస్తున్న రైళ్లను కర్నూలు వరకు పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సునాయాసంగా రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలను గాలికొదిలేసి కర్నూలు నుంచి విజయవాడ మీదుగా విశాఖ వరకు పెట్‌ సర్వే (ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ సర్వే) పేరుతో హడావుడి చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
* విశాఖపట్నం నుంచి కాచిగూడ వరకు నడిచే రైలును ఇటీవల మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించారు. ఈ రైలు ఉదయం 9.20 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4.10 గంటలకు మహబూబ్‌నగర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ వెళ్తుంది. ఈ రైలు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంది. దీనిని కర్నూలు వరకు పొడిగించేందుకు అన్నిరకాల అనుకూలతలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి 2.50 గంటలలోపే కర్నూలు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రైలు సాయంత్రం వరకు ఖాళీగా ఉంటోంది. అలాకాక కర్నూలు వరకు పొడిగిస్తే నిత్యం వేలాది మందికి సౌకర్యంగా ఉండటంతోపాటు రైల్వేకు ఆదాయం సైతం లభిస్తుంది. కర్నూలు జిల్లా వాసులతోపాటు గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాలవారు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నేరుగా వెళ్లేందుకు రైలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.


డోన్‌ వరకు నడిపితే..

సికింద్రాబాద్‌లో ఉదయం 7.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు వచ్చే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం మూడు గంటల వరకు స్టేషన్‌లోనే ఉంటోంది. ఈ ఖాళీ సమయంలో డోన్‌ వరకు వెళ్లి వచ్చేందుకు అన్నిరకాల అనుకూలతలు ఉన్నాయి. అయినప్పటికీ కర్నూలు స్టేషన్లోనే నిరుపయోగంగా ఉంచుతున్నారు. తుంగభద్ర రైలును డోన్‌ వరకు పొడిగిస్తే నగరం నుంచి డోన్‌ వెళ్లాల్సినవారు.. డోన్‌ నుంచి నేరుగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లాలనుకునేవారు సులువుగా తమతమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తుంగభద్ర రైలు పొడిగింపుపై దృష్టి సారించకపోవడం గమనార్హం.


ఆదాయం కోల్పోతూ..

రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైన రైలు సర్వీసులను సాధించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు లేఖలు రాసి మమ అనిపించేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులైతే అసలు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైల్వే అధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ అదనపు సర్వీసులపై పెద్దగా ఒత్తిడి తీసుకురావడం లేదు. ఫలితంగా కర్నూలు రైల్వేస్టేషన్‌ నుంచి ఆశించిన స్థాయిలో రైలు సర్వీసులు లేని   పరిస్థితి నెలకొంది. మరోవైపు రైల్వే శాఖ అదనపు ఆదాయాన్ని కోల్పోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని