logo

విద్యా కానుక.. అరకొరే

ఏటా బడుల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

Published : 03 Jun 2023 01:57 IST

 మరో 10 రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
పూర్తిస్థాయిలో చేరుకోని కిట్లు

సి.బెళగల్‌ మండల విద్యావనరుల కేంద్రానికి చేరిన పుస్తకాలు

కర్నూలు విద్య, నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే:  ఏటా బడుల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి రోజే పూర్తి స్థాయిలో జగనన్న విద్యా కిట్లు అందించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాకు ఇప్పటి వరకు వచ్చిన బూట్లు, సమదుస్తులు, పిక్టోరియల్‌, ఆక్స్‌ఫర్డ్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేశారు. వాస్తవానికి పరిశీలిస్తే ఇప్పటికీ అవసరమైన సామగ్రి అందలేదు. నంద్యాల జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది.

నోటు పుస్తకాలు.. బ్యాగులు రాలేదు..

నంద్యాల జిల్లాకు పాఠ్య పుస్తకాలు (సెమ్‌ 1) 11,01,219 రావాల్సి ఉండగా 6,64,095 మాత్రమే వచ్చాయి. ఇంకనూ 4,37,124 పుస్తకాలు రావాల్సి ఉంది. సమదుస్తులు 1,62,276 అవసరం కాగా.. 1,13,055 వచ్చాయి. నోటు పుస్తకాలు 9,56,152 రావాల్సి ఉండగా ఒక్కటి కూడా రాలేదు. బూట్లు, సాక్సులు 1,62,276 రావాల్సి ఉండగా అందలేదు. బ్యాగులు 1,62,276 అవసరం కాగా ఒక్కటి కూడా రాకపోవడం గమనార్హం.

ఆయా మండలాల్లో ఇలా..

కర్నూలు జిల్లా పరిధిలో ఆదోని, ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, హొళగుంద, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, నందవరం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాలకు సమదుస్తులు ఒక్కటి కూడా కేటాయించలేదు. ఆస్పరి, ఆలూరు, సి.బెళగల్‌, దేవనకొండ, హాలహర్వి, హొళగుంద, కల్లూరు, కోడుమూరు, కౌతాళం, కృష్ణగిరి, మంత్రాలయం, ఓర్వకల్లు, పత్తికొండ, పెద్దకడబూరు, వెల్దుర్తి మండలాలకు బ్యాగులు అందలేదు. జిల్లా పరిధిలోని ఒక్క మండలానికి కూడా నోటు పుస్తకాలు, బెల్టులు అందకపోవడం గమనార్హం.


60 శాతం వరకు వచ్చిన సామగ్రి

కర్నూలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో సుమారు 2,92,955 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి వరకు బ్యాగులు 1,01,700, బూట్లు 2,76,868, సమ దుస్తులు 1,46,765, పిక్టోరియల్‌ పుస్తకాలు 25,187, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులు 13,463, పాఠ్య పుస్తకాలు 11,34,536, వర్క్‌ బుక్స్‌ 3,50,607 వచ్చాయి. ఒక్కో విద్యార్థికి రెండు జతల సమ దుస్తులు ఇస్తారు. ఈ లెక్కన చూస్తే ఇంకనూ సుమారు 4.40 లక్షల వరకు సమ దుస్తులు రావాల్సి ఉంది. గతేడాది జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ సమయానికి పూర్తి స్థాయిలో కానుకలు లేకపోవడంతో ఒక్కో పాఠశాలకు ఐదు కిట్లు ఇచ్చి పంపిణీ చేశారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది విద్యా ప్రారంభం రోజు జగనన్న విద్యా కానుకలు పూర్తిగా అందజేస్తామని సమగ్ర శిక్ష ప్రాజెక్టు అదనపు సమన్వయకర్త వేణుగోపాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని