logo

గడువు ముగిసింది.. నిషేధం వచ్చింది

సాధారణ బదిలీల ప్రక్రియ మే నెలాఖరుకు ముగిసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి బదిలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 04 Jun 2023 02:51 IST

రెవెన్యూలో ప్రారంభంకాని బదిలీల ప్రక్రియ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సాధారణ బదిలీల ప్రక్రియ మే నెలాఖరుకు ముగిసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి బదిలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ నిర్వహించలేదు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ నోడల్‌ అధికారిగా.. నంద్యాల కలెక్టర్‌ మెంబర్‌గా బదిలీలు చేపట్టాల్సి ఉంది. వీఆర్వో కేడర్‌ నుంచి డీటీ, తహసీల్దారు కేడర్‌ వరకు బదిలీలు చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఆ ఊసే లేకుండా పోయింది.

దరఖాస్తు చేసుకున్నా..

కర్నూలు జిల్లాలో 11 మంది తహసీల్దార్లు, 19 మంది ఉప తహసీల్దార్లు, 20 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లు, ఆరుగురు డీటీలు బదిలీల కోసం కర్నూలు కలెక్టర్‌కు దరఖాస్తు ఇచ్చారు. సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలకు సంబంధించిన జాబితా నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి ఇప్పటి వరకు రాలేదు. ఇక జూనియర్‌ అసిస్టెంట్లు, వీఆర్వోలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 60-70 మంది వరకు ఉంటారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ హడావుడి కనిపించడం లేదు.

సిఫార్సు లేఖలే అధికం

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వీఆర్వోల బదిలీలు సైతం కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంది. నంద్యాల జిల్లా నుంచి బదిలీలకు సంబంధించిన వివరాలు రాలేదని జిల్లా రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు బదిలీల కోసం అధికార పార్టీకి చెందిన నేతల సహకారంతో ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం నుంచి జిల్లాకు బదిలీల సిఫార్సులు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి కోరుకున్న చోటుకు బదిలీ చేసేలా సిఫార్సు లేఖలు తీసుకుని దరఖాస్తులను కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారులకు నివేదించారు. గ్రామ, వార్డు సచివాలయ గ్రేడ్‌-2 వీఆర్వోలు సైతం ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీ కోసం దరఖాస్తులు ఇచ్చారు. మొత్తం మీద సిఫార్సు లేఖలే అధికంగా ఉన్నాయి. ఎలాంటి సిఫార్సులు లేకుండా బదిలీలకు దరఖాస్తు చేసుకున్న రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే చెప్పవచ్చు.

సీఎం పర్యటన కారణంగానే..

పరిపాలనాపరంగా అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ కీలకం. సాధారణ బదిలీల గడువు ముగిసి మూడు రోజులైనా బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఆయా శాఖల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించకుంటే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టే పరిస్థితి ఉంది. అయినా పాలనాధికారులు జాప్యం చేయడంపై ఎవరూ నోరు మెదపడం లేదు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండటంతో బదిలీల ప్రక్రియ కాస్య ఆలస్యమైందని కొందరు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గడువు ముగిసినప్పటికీ మే 31వ తేదీతో బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారని.. దీనికి ఆందోళన చెందాల్సిన పనిలేదని మరికొందరు అంటున్నారు. అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన రెవెన్యూ శాఖలో ఏటా బదిలీల ప్రక్రియ గడువు ముగిసిన నాలుగైదు రోజుల తర్వాతే బదిలీల ఉత్తర్వులు బయటకు వస్తాయన్నది సర్వసాధారణమైంది. రెండు జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలు, జేసీలు సమావేశమై వీఆర్వో కేడర్‌ నుంచి తహసీల్దారు కేడర్‌ వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని