logo

అరుణాచల ప్రయాణం.. అంతులేని విషాదం

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నంద్యాలకు చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.

Published : 04 Jun 2023 02:51 IST

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నంద్యాలకు చెందిన నలుగురు దుర్మరణం

మృతులు లక్ష్మీదేవి, విమలమ్మ, ప్రతాప్‌రెడ్డి, శివమ్మ (పాతచిత్రాలు)

నంద్యాల నేర విభాగం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నంద్యాలకు చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. నంద్యాల సెబ్‌ సీఐగా పనిచేస్తున్న నాగమణి, విమలమ్మ, లక్ష్మీదేవి కుటుంబాలు నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో ఇరుగు పొరుగున నివసిస్తున్నాయి. వీరితో పాటు పరిచయస్తులైన మరికొందరు కలిసి కాణిపాకం, అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అద్దె వాహనాన్ని తీసుకుని ఆరు కుటుంబాల నుంచి రమేశ్‌, స్వాతి, ఉషారాణి, నాగమణి, తనూశ్‌, మనీషా, రామతులసి, మన్విత, ప్రతాప్‌రెడ్డి, శివమ్మ, విమలమ్మ, లక్ష్మీదేవి, చోదకుడు ఆదినారాయణతో కలిసి మొత్తం 13 మంది శుక్రవారం రాత్రి 10.30 గంటలకు నంద్యాలలో బయల్దేరారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల పరిధిలోని కల్లూరు నుంచి పీలేరుకు వెళ్లే మార్గంలో ఎంజేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని మలుపులో వీరు ప్రయాణిస్తున్న వాహనం.. సిమెంట్‌ లారీని వెనుక భాగాన బలంగా ఢీకొంది. ప్రమాదంలో ప్రతాప్‌రెడ్డి(39), శివమ్మ(45), విమలమ్మ(52), లక్ష్మీదేవి(54) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సెబ్‌ సీఐ నాగమణి, రమేశ్‌, స్వాతి గాయపడటంతో  తిరుపతికి తరలించారు.

పిల్లల ఎదుటే మృతి

ప్రమాదంలో ప్రతాప్‌రెడ్డి మృతి చెందగా భార్య స్వాతి గాయపడింది. పిల్లలకు ఎటువంటి గాయాలు లేవు. ఇదే వాహనంలో కుమార్తె మన్వితతో కలిసి శివమ్మ అరుణాచలం బయలుదేరారు. ప్రమాదంలో మన్విత ఎదుటే తల్లి శివమ్మ మృతిచెందింది. కళ్ల ఎదుటే కన్నవాళ్లు మృత్యువాత పడటంతో పిల్లలు బోరున విలపించారు.

డ్రైవర్ల తప్పిదమే కారణం

ప్రమాద స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ కె.శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఎస్సై రవిప్రకాష్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పీలేరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న లారీ.. ఘాట్‌ రోడ్డు రావడంతో డ్రైవరు గేరు మార్చగా వేగం తగ్గింది. అంతలోనే భక్తులతో వస్తున్న వాహనం అతివేగంగా దూసుకురావడంతో లారీని వెనుక భాగంలో ఢీకొంది. మరోసారి లారీ ముందు భాగాన ఢీకొంది. ఇద్దరు డ్రైవర్ల తప్పిదంతోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ, సీఐ తెలిపారు. వాహనం డ్రైవరు ఆదినారాయణ, లారీ డ్రైవరు పుమారియప్పన్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని