logo

బాలికను నమ్మించి.. పెళ్లి చేసుకుని..

ఓ బాలికను నమ్మంచి, పెళ్లి చేసుకున్నాడన్న అభియోగంపై ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన వీరేష్‌, ఇందుకు సహకరించిన ఈరన్న, లక్ష్మణ్‌ను అరెస్టు చేసినట్లు ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు.

Updated : 07 Jun 2023 05:05 IST

వివరాలు వెల్లడిస్తున్న ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ మహేశ్వరరెడ్డి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ బాలికను నమ్మంచి, పెళ్లి చేసుకున్నాడన్న అభియోగంపై ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన వీరేష్‌, ఇందుకు సహకరించిన ఈరన్న, లక్ష్మణ్‌ను అరెస్టు చేసినట్లు ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. ఆదోని తాలుకా పోలీసు స్టేషన్‌లో మంగళవారం డీఎస్పీ శివనారాయణస్వామి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి, పెద్దతుంబళం ఎస్సై రమేష్‌బాబుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన వీరేష్‌, వారి అన్నలు బీటీ ఈరన్న, లక్ష్మణ్‌ సహకారంతో 2023 మే 31న బాలికను కారులో తీసుకెళ్లి, కర్ణాటకలోని చిన్న గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. బాలికను మాయ మాటలతో నమ్మించి, పెళ్లి చేసుకుందామని చెప్పి దండలు మార్చుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. కర్ణాటకలోని సిందనూరు తాలుకా ఆయనూర్‌ గ్రామం వద్ద ఉన్న నిందితుడు వీరేష్‌, కోస్గి మండలం ఐరన్‌గళ్‌ గ్రామానికి చెందిన తలారి ఈరన్న, గ్యాంగ్‌ లక్ష్మణ్‌ను అరెస్టు చేశామన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. కోర్టు రిమాండుకు అదేశించినట్లు పేర్కొన్నారు. పోక్సో కేసులో సహకారం అందిస్తే వారు కూడా కఠిన శిక్షకు అర్హులవుతారని వెల్లడించారు. కారు డ్రైవర్‌పైనా కేసు నమోదు చేశామని, గాలిస్తున్నామన్నారు.


యువకుడి అనుమానాస్పద మృతి

కృష్ణదొడ్డి (సి.బెళగల్‌), న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణదొడ్డి గ్రామానికి చెందిన వెంకట్రాముడు (23) అనే యువకుడు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్సై ఏసీ పీరయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణదొడ్డి గ్రామంలో రైతు వెంకటేశు, సావిత్రిలకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు. కూతురు వివాహం చేశారు. పెద్ద కుమారుడు హరి, చిన్న కుమారుడు వెంకట్రాముడు. చిన్న కుమారుడు ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు తిరుపతిలో చదివి ఉద్యోగ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌కు వెళ్లి శిక్షణ పొంది ఏప్రిల్‌ నుంచి సొంత గ్రామానికి వచ్చి ఉపాధి పనులకు వెళ్తుండేవారు. సోమవారం వెంకట్రాముడు ఉపాధి పనులు చేసి ఇంటికి వచ్చి తండ్రి వెంకటేశుకు సి.బెళగల్‌ గ్రామానికి వెళ్తానని తండ్రి వద్ద రూ.200 తీసుకుని వెళ్లారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో మొబైల్‌కు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు, బంధువులు అతని ఆచూకీ కోసం వెతికారు. గ్రామ శివారులోని చెత్త సేకరణ కేంద్రం వద్దనున్న కొండల్లో మృతదేహం కనిపించింది. పక్కన మొబైల్‌ పడి ఉంది. కుమారుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు పంచనామా చేసి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి.బెళగల్‌ ఎస్సై పీరయ్య పేర్కొన్నారు. యువకుని ఫోన్‌లో కాల్‌ డేటా వివరాలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


యువకుడి ఆత్మహత్య

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులోని బుధవారపేటకు చెందిన ముత్యాలరాజు అలియాస్‌ నవీన్‌(18) ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నన్న, జయమ్మ దంపతుల రెండో సంతానమైన ముత్యాలరాజు బేల్దారు పనిచేసేవారు. తాగుడుకు బానిసై మద్యంమత్తులో సోమవారం రాత్రి ఇంట్లో పంకకు చీరతో ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కర్నూలు మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కాబోయే వధువును ఎత్తుకెళ్లాడు

మంత్రాలయం, న్యూస్‌టుడే: కాబోయే వధువును పెళ్లయిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని చెట్నిహళ్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెట్నిహళ్లి గ్రామానికి చెందిన ఒక యువతికి ఈ నెల 13న వివాహం నిశ్చయమైంది. అదే గ్రామానికి చెందిన పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలున్న వ్యక్తి సురేశ్‌ ఆమెకు మాయమాటలు చెప్పి బెదిరించి ఎత్తుకెళ్లాడని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి, సురేశ్‌తోపాటు ఇరు కుటుంబాల వారికి మంత్రణం చేసి పంపించామని పోలీసులు పేర్కొన్నారు.


ఆదోనిలో ఆగని దొంగతనాలు

ఒకే రోజు నాలుగు దుకాణాలకు కన్నం

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో సోమవారం అర్ధరాత్రి మళ్లీ దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. ఏకంగా నాలుగు దుకాణాలకు కన్నం వేసి నగదు, సామగ్రిని ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం శిరుగుప్ప చెక్‌పోస్టు సమీపంలో ఇమ్రాన్‌ ఐరన్‌ మార్ట్‌ దుకాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు దుకాణానికి ఉన్న రేకుల షెడ్డును తొలగించి లోపలికి వెళ్లి, పెట్టెలో ఉంచిన రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిపోయారని బాధితుడు ఇమ్రాన్‌ వాపోయాడు. ఇమ్రాన్‌ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన ముఖానికి కర్చిప్‌ కట్టుకొని నగదు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైంది. సమీపంలో ఉన్న మహాలక్ష్మి ఆటో మొబైల్స్‌ దుకాణంలోనూ వెనుకపక్క నుంచి రేకుల షెడ్డును దొంగ తొలగించి పెట్టెలోని రూ.3,500 ఎత్తుకెళ్లినట్లు బాధితుడు రవికుమార్‌ తెలిపారు. పక్కనే ఉన్న మెకానిక్‌ షెడ్డులో రూ.15వేలు విలువ చేసే పరికరాలు చోరీ చేశారని బాధితుడు హుసేన్‌వలి పేర్కొన్నారు. రాయనగర్‌ సమీపంలో ఉన్న పటేల్‌ ఐరన్‌ మార్ట్‌ దుకాణంలోనూ దొంగ చొరబడి పెట్టెలో ఉంచిన రూ.6 వేలు ఎత్తుకెళ్లారని దుకాణ నిర్వాహకుడు పేర్కొన్నారు. ఒకే రోజులో నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడటంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల నుంచి వివరాలు సేకరించి,  సీసీ కెమెరాలను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని