logo

రుధిర దారులు

రహదారులు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. ఒకవైపు అతివేగం, నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతుండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Updated : 07 Jun 2023 04:59 IST

వాహన చోదకుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: రహదారులు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. ఒకవైపు అతివేగం, నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతుండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారులపైనేకాక గ్రామీణ ప్రాంత మార్గాల్లోనూ అధికంగా రహదారి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

నిర్వహణ అధ్వానం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40, 44, 167 జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర, గ్రామీణ ప్రాంత రహదారులు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబరు జాతీయ రహదారి విషయానికొస్తే కనీస నిర్వహణ కానరావడం లేదు. కర్నూలు నుంచి ప్యాపిలి వరకు మూడు ప్రత్యేక వాహనాలు ఉండాల్సి ఉండగా ఒక్కటే ఉండటం గమనార్హం. నిత్యం హైవేని పరిశీలించి గుంతలు పూడ్చటం, సూచికలు ఏర్పాటు చేయటం, మట్టి తొలగించడం.. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో లోపాలు సరిచేయడం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. వెల్దుర్తి సమీపంలో హైవే కూడలి వద్ద డ్రమ్ములు ఏర్పాటు చేయటం.. రాత్రి వేళల్లో వాహనచోదకులకు సరిగా కనపడకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. కర్నూలు శివారులోని గుత్తి పెట్రోలు బంకు వద్ద ఉపరితల వంతెనపై లైట్లు ఉన్నా వెలగకపోవడంతో రాత్రివేళల్లో చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయి.

రెండు రోజుల వ్యవధిలో..

* నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన హుస్సేని (35) తన భార్య ఖాశీంబీ, కుమార్తెలు హుస్సేనా, రిజ్వానా, రెజీనా, కుమారుడు అర్షద్‌తో కలిసి సోమవారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారు ఢీకొంది. ఈ ఘటనలో హుస్సేని, హుస్సేనా ప్రాణాలు కోల్పోయారు.
* కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బండి ఆత్మకూరుకు చెందిన మునీర్‌బాషా (40), ముద్దత్‌ షీర్‌ (12), వెలుగోడు పట్టణానికి చెందిన రమీజాబేగం (50) నయామత్‌ (40), సుమ్మి (13) తదితరులు కలిసి గుల్బర్గా దర్గాను దర్శించుకునేందుకు ఈనెల 5న బయలుదేరారు. యాదగిరి జిల్లా బలిచక్కర్‌ వద్ద ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని వీరి వాహనం ఢీకొంది.  

యథేచ్ఛగా సర్వీసు రోడ్ల ఆక్రమణ

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో సర్వీసు రహదారులు ఆక్రమణలకు గురవుతున్నాయి.  కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడు వద్ద ఓ హోటల్‌ నిర్వాహకుడు ఏకంగా సర్వీసు రోడ్డును పార్కింగ్‌ స్థలంగా మార్చుకున్నారు. కర్నూలు-కడప మీదుగా వెళ్లే 40, 167 నంబరు జాతీయ రహదారుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో కనీసం గుంతలు పూడుస్తున్న దాఖలాలు లేవు. కర్నూలు- కోడుమూరు వెళ్లే రహదారి సింగిల్‌ రోడ్డు కావడంతో వాహనాలు ఎదురెదురుగా ఢీకొని  ప్రాణాలు కోల్పోతున్నారు.

కారణాలెన్నో..

* వాహనదారుల అతివేగం కారణంగానే రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగంగా వెళ్లే భారీ వాహనాలు చిన్న వాహనాలను ఢీకొన్న సందర్భంలో ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. పలువురు మద్యం తాగి నడపడంతో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు మద్యం తాగేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌ వెళ్తున్నారు. తిరిగి వచ్చే క్రమంలో రహదారి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా చనిపోయేవారి సంఖ్య ఏటా పదుల సంఖ్యలోనే ఉంటోంది.
* కారు చోదకులు సీటు బెల్టు పెట్టుకోకపోవటంతో ప్రమాదాలకు గురైన సందర్భంలో ప్రాణాలు కోల్పోతున్నారు.
* ద్విచక్ర వాహనచోదకులు శిరస్త్రాణం ధరించకపోవడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసు, రవాణా శాఖ అధికారులు నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని