logo

నిర్వహణ గాలికి.. వాహనాలు మూలకు

డోన్‌ పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించి మినీ పొక్లెయిన్‌ ఓసారి మరమ్మతులకు గురైతే కర్నూలులోని షోరూంలో రూ.33 వేలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించారు.

Updated : 07 Jun 2023 05:00 IST

స్వచ్ఛతపై దృష్టి సారించని అధికారులు

నిరుపయోగంగా వాహనాలు


తుప్పు పట్టి..

డోన్‌ పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించి మినీ పొక్లెయిన్‌ ఓసారి మరమ్మతులకు గురైతే కర్నూలులోని షోరూంలో రూ.33 వేలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించారు. కొన్ని రోజులు పనిచేసి ప్రస్తుతం మూలకు చేరింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ కింద వచ్చిన వాహనాల్లో కొన్ని మరమ్మతులకు నోచుకోవడం లేదు. కాల్వల్లో పూడిక తొలగించే లోడర్‌ విలువ రూ.25 లక్షలు. వీధుల్లో కాల్వలు చిన్నవిగా ఉండటంతో ఈ వాహనం ద్వారా పూడిక తొలగించలేని పరిస్థితి. దీనిని జీడీపీ ప్లాంటు వద్ద వృథాగా ఉంచారు. మూడు కాంపాక్టర్లు రాగా వాటిలో ఒకటి మరమ్మతుకు గురై తుప్పు పట్టిపోతోంది. రూ.25 లక్షలతో స్వీపింగ్‌ యంత్రం తెప్పించారు. కొన్నాళ్లపాటు ఉపరితల వంతెన, వంతెనకు ఇరువైపులా రహదారులను శుభ్రం చేయించారు. ఆ యంత్రానికి ఉన్న బ్రష్‌లు పోవడం, ఇంజిన్‌ సరిగా పనిచేయక మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో నిరుపయోగంగా ఉంచారు. 

న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల పురపాలక సంఘాల్లో యాంత్రీకరణ ద్వారా స్వచ్ఛ వాతావరణం కల్పించేందుకు  అత్యాధునికమైన వాహనాలు, పరికరాలను ప్రభుత్వం అందించింది. యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయించడం ద్వారా ఆయా ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలనేది లక్ష్యం. గత ప్రభుత్వంలో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ చేయూతతో వివిధ రకాల వాహనాలు సమకూరాయి. ఇందులో చిన్న, పెద్ద కాంపాక్టర్లు, డోజర్లు, నాలా క్లీనర్లు, రోడ్డు స్వీపింగ్‌ యంత్రాలు, డంపర్‌ బిన్లు.. తదితర వాహనాలు అందించారు. వీటి నిర్వహణపై సరైన శ్రద్ధ చూపకపోవడంతో మూలనపడ్డాయి. ఫలితంగా రూ.కోట్లు వెచ్చించి కేటాయించిన వాహనాలు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పనిరాకుండా పోతున్నాయి. ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే

మూలన పెట్టేశారు

ఆదోని పురపాలక సంఘానికి రెండు రోడ్డు స్వీపింగ్‌ వాహనాలు వచ్చాయి. ఒక్కో దాని విలువ రూ.లక్షల్లో ఉంటుంది. ఇవి వచ్చి ఐదేళ్లు దాటిపోయింది.. ఇంతవరకు పూర్తిస్థాయిలో వినియోగించలేదు. మధ్యలో ఓసారి విమర్శలు రావడంతో కొన్ని రోజులపాటు వినియోగించారు. ఆ తర్వాత మూలన పెట్టేశారు. ఏటా వీటి నిర్వహణ కోసం గతంలో రూ.20 లక్షలతో టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా వృథాగా పడేశారు. వీటితోపాటు మూడు నాలా క్లీనింగ్‌ వాహనాలు వచ్చాయి. ఇవన్నీ మూలనపడ్డాయి. గతంలో సైతం ఓ పెద్ద కాంపాక్టరు విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోయింది.

నిపుణులు దొరక్క

నంద్యాల పురపాలక సంఘంలో గత ప్రభుత్వ హయాంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ద్వారా పలు వాహనాలు వచ్చాయి. రెండు స్వీపింగ్‌ యంత్రాలు రాగా కొంత కాలం పాటు నిర్వహించారు. వీటికి డ్రైవర్లు దొరక్క మూలకు నెట్టేశారు. నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో నంద్యాల పురపాలక సంఘం వీటి నిర్వహణకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. వాహనాలు తరచూ పాడవుతుండటం.. నిపుణులు దొరక్క చేసేదిలేక రూ.లక్షల విలువ చేసే వాహనాలు ఇలా మూలన పెట్టేశారు.
న్యూస్‌టుడే, నంద్యాల పురపాలకం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని