logo

మృత్యుకేళి..పంచ ప్రాణాలు బలి

కర్ణాటక రాష్ట్రం కలబురగిలోని ఖ్వాజా బందే నవాజ్‌ దర్గాను సందర్శించాలన్నది వారి చిరకాల కోరిక. ఎట్టకేలకు పరిస్థితులు అనుకూలించడంతో బంధువులంతా కలిసి.. అద్దె వాహనంలో ఆనందంగా ప్రయాణమయ్యారు.

Published : 07 Jun 2023 02:37 IST

వెలుగోడు, బండి ఆత్మకూరులో విషాదం
కలబురగి దర్గా సందర్శనకు వెళుతుండగా ప్రమాదం

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రం కలబురగిలోని ఖ్వాజా బందే నవాజ్‌ దర్గాను సందర్శించాలన్నది వారి చిరకాల కోరిక. ఎట్టకేలకు పరిస్థితులు అనుకూలించడంతో బంధువులంతా కలిసి.. అద్దె వాహనంలో ఆనందంగా ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో వీరి ప్రయాణంపై మృత్యువు పంజా విసిరింది. ఘోర రహదారి ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 14 మంది గాయాలపాలయ్యారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన వెలుగోడు, బండిఆత్మకూరులోని బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది.

* వెలుగోడుకు చెందిన రమీజాబేగంకు అస్మా, నసీమ ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో ఆస్మాను బండిఆత్మకూరుకు చెందిన మునీర్‌బాషాకు, నసీమను వెలుగోడుకు చెందిన న్యామతుల్లాకు ఇచ్చి 12 ఏళ్ల కిందట వివాహం జరిపించారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన 18 మంది సభ్యులు కలబురగి దర్గా సందర్శన కోసం సోమవారం రాత్రి తుఫాను వాహనంలో బయల్దేరారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా సైదాపూరు సమీపంలోని బళిచక్రి గ్రామ క్రాస్‌లో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని మంగళవారం తెల్లవారుజామున 2.30-3.00 గంటల ప్రాంతంలో వీరి వాహనం వెనుకవైపు నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రమీజాబేగం (50), ఈమె మనవరాలు సుమ్మి (12), మునీర్‌బాషా (40), ఆయన కుమారుడు ముదష్షిర్‌ (12), న్యామతుల్లా (40) మృతి చెందారు. మునీర్‌బాషా భార్య అస్మా, మరో కుమారునికి గాయాలయ్యాయి. రమీజాబేగం సోదరి రియాజున్‌, ఆమె కుమార్తెలు అక్రిన్‌, ముజఫీర్‌, రమీజాబేగం కుమారుడు మాసుంబాషా, కోడలు హనీఫాతోపాటు మిగతా వారికీ గాయాలయ్యాయి. వాహన చోదకుడు సుభాన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకకు బయల్దేరారు. మృతదేహాలను బుధవారం తీసుకొచ్చే అవకాశం ఉంది.

పేదల బతుకు అతలాకుతలం

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రహదారి ప్రమాదం.. రెండు పేద కుటుంబాలను అతలాకుతలం చేసింది. బండి ఆత్మకూరుకు చెందిన మునీర్‌బాషాకు ఎకరాన్నర భూమి ఉంది. దీనిని సాగు చేయడంతోపాటు తాపీ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. వెలుగోడుకు చెందిన న్యామతుల్లా గౌండా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ప్రమాదంలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పెద్దలతో పాటు ఇద్దరు చిన్నారులు సైతం మృతి చెందడంతో రెండు కుటుంబాలవారు తీవ్రంగా విలపించారు. తల్లితోపాటు భర్త, పిల్లలను కోల్పోయి అస్మా, నసీమ శోకసంద్రంలో మునిగిపోయారు. తమకెవరు దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల రోదనలతో బండి ఆత్మకూరు, వెలుగోడు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు