logo

ఈ నిర్లక్ష్యంపై ఎక్స్‌రే తీసేదెన్నడో

ప్రమాదాలు జరిగినప్పుడు అవయవాలకు ఏమైనా నష్టం జరిగితే వాటి పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్‌రే యంత్రాలు ఎంతో కీలకం.

Updated : 07 Jun 2023 05:02 IST

పలు ఆస్పత్రుల్లో పనిచేయని యంత్రాలు

కోవెలకుంట్లలో వృధాగా ఎక్స్‌రే యంత్రం 

డోన్‌ పట్టణం, నంద్యాల పాత పట్టణం, కోవెలకుంట్ల గ్రామీణ, న్యూస్‌టుడే : ప్రమాదాలు జరిగినప్పుడు అవయవాలకు ఏమైనా నష్టం జరిగితే వాటి పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్‌రే యంత్రాలు ఎంతో కీలకం. వీటి ద్వారా సమస్య తెలుసుకుని చికిత్స అందించవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రుల్లో ఎక్స్‌రే యంత్రాలు మూలనపడ్డాయి. రూ.లక్షలు ఖర్చు పెట్టి వీటిని ఏర్పాటుచేయగా ప్రసుత్తం పనిచేయడం లేదు.  

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17 సీహెచ్‌సీలు, కర్నూలు, నంద్యాల సర్వజన ఆసుపత్రులు, ఆదోని ఎంసీహెచ్‌, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, బనగానపల్లి ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు పొందేందుకు రోగులు వస్తుంటారు. జీజీహెచ్‌, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే యంత్రాలు ఉన్నాయి. డార్క్‌రూమ్‌ అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేడియోగ్రాఫర్స్‌, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్ల కొరత వేధిస్తోంది. ఫలితంగా సమస్యలు ఎదురవుతున్నాయి. రహదారి ప్రమాదాలు తదితర కారణాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వచ్చినప్పుడు దెబ్బతిన్న భాగాలను ఎక్స్‌రే ద్వారా గుర్తించాల్సి ఉంది. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే ప్లాంట్లు అందుబాటులో లేక క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చివరికి ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. బయట ఎక్స్‌రే కోసం రూ.500కుపైగా ఖర్చు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.

డిజిటల్‌ ఎక్స్‌రేలు ఉన్నా..

డోన్‌ సీహెచ్‌సీ కేంద్రంగా ఉన్న సమయంలో ఎక్స్‌రే యంత్రం కేటాయించారు. పదేళ్ల కిందట మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రి హోదా లభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవ చూపి డోన్‌, బేతంచెర్ల ఆసుపత్రులకు ఒక్కొక్కటి రూ.11.20 లక్షల విలువ చేసే డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలను 2022 మార్చిలో తెప్పించారు. నందికొట్కూరు, సున్నిపెంట సీహెచ్‌సీల్లో డిజిటల్‌ సీఆర్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ రీడర్‌, ప్రింటర్‌ తదితరాలు లేక ఎక్స్‌రే తీయలేని పరిస్థితి. డోన్‌ ఏరియా ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్‌, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ను నియమించారు. రేడియోగ్రాఫర్‌ గైనిక్‌లో, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ ఓపీ రాసిచ్చే పనులు చేస్తున్నారు.

మరమ్మతులు ఎప్పుడో..

కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్లు, పత్తికొండ మండలాల్లోని ఆసుపత్రుల్లో ఎక్స్‌రే యంత్రాల ఊసే లేదు. ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రిలో అదనంగా ఉన్న యంత్రాన్ని కోడుమూరు సీహెచ్‌సీకి తరలించారు. ఆలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే ప్లాంటు మరమ్మతులకు గురవడంతో గత కొన్నేళ్లుగా మూలన పడింది. ఫలితంగా రహదారి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారిని గుంతకల్లు, బళ్లారి, ఆదోని, కర్నూలు వంటి ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారు. కర్నూలు సర్వజన ఆసుపత్రిలోనూ ఎక్స్‌రే యంత్రాలు పనిచేయడం లేదు. ఆదోనిలో విద్యుత్తు సరఫరా ఆగిపోతే ఎక్స్‌రే తీయలేని పరిస్థితి నెలకొంది. జనరేటర్‌ సౌకర్యం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

సేవలందక ఇబ్బందులు

ఆళ్లగడ్డ, ఆత్మకూరు, పాణ్యం, వెలుగోడు, మిడుతూరు, అవుకు తదితర ప్రాంతాల్లోని సీహెచ్‌సీల్లో ఎక్స్‌రే యంత్రాలు లేక క్షతగాత్రులకు సేవలు అందించడం లేదు. కోవెలకుంట్ల సీహెచ్‌సీలో ఎక్స్‌రే యంత్రం మూలకు చేరి ఏడాదికిపైగా కావస్తోంది. నంద్యాల జిల్లాలోని సర్వజన ఆసుపత్రిలో రెండు ఎక్స్‌రే యంత్రాలు పని చేయడం లేదు. దీనికితోడు సిబ్బంది కొరతతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరం ఉన్నవారిని ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని