logo

బటన్‌ నొక్కారు.. భరోసా మరిచారు

జూన్‌ ఒకటిన పత్తికొండలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుబడి సాయం బటన్‌ నొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 52.31 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.3,9,23.22 కోట్ల వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయాన్ని విడుదల చేసినట్లు ప్రకటించారు.

Updated : 08 Jun 2023 09:37 IST

జమకాని పెట్టుబడి సాయం 

బ్యాంకు చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు

జూన్‌ ఒకటిన పత్తికొండలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుబడి సాయం బటన్‌ నొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 52.31 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.3,9,23.22 కోట్ల వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయాన్ని విడుదల చేసినట్లు ప్రకటించారు.

వారం రోజులైనా 50 శాతం మందికిపైగా రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ కాలేదు. చరవాణి నంబర్లకు సంక్షిప్త సమాచారం రావడం లేదు. రైతు భరోసా వెబ్‌సైట్‌లో రైతు ఆధార్‌ నంబరును నమోదు చేస్తే అండర్‌ ప్రాసెస్‌ అంటూ సంక్షిప్త సమాచారం కనిపిస్తోంది. పెట్టుబడి సాయం రూ.7,500 జమ చేసినట్లు పత్తికొండ సభలో సీఎం వెల్లడించినా పలువురికి రూ.5,500 జమవడం గమనార్హం.

పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయానికి సంబంధించి దేశవ్యాప్తంగా రైతులకు రూ.2 వేల పెట్టుబడి సాయాన్ని ప్రధాని జమ చేయనున్నారు. అది ఎప్పుడన్నది కేంద్రం ఇప్పటికీ ప్రకటన చేయలేదు. అయినా అంతా తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా రైతుల ఖాతాలకు రూ.7,500 జమ చేసినట్లు చెప్పుకోవడం గమనార్హం.
కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే : కర్నూలు జిల్లాలో భూ యజమానులు 2,83,305 మంది, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు 86 మంది, కౌలు రైతులు 3,522 మంది కలిపి మొత్తం 2.86 లక్షల మంది ఉన్నారు. నంద్యాల జిల్లాలో భూ యజమానులు 2,19,350 మంది, అటవీ భూములు సాగు చేసుకునేవారు 441 మంది, కౌలు రైతులు 7,066 మంది కలిపి మొత్తం 2.26 లక్షల మంది ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా కౌలుదారులకు సీసీఆర్‌సీ కౌలు కార్డులు మంజూరు చేయగా.. అందులో సగం మందికే పెట్టుబడి సాయం అందనుంది. మిగిలిన సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారీగా విభజించి అర్హులైన కౌలుదారులకు సాయం ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్క పైసా అందలేదు

రామకృష్ణ, రైతు, కల్లూరు

ఖరీఫ్‌ సీజన్‌లో రైతు భరోసా-పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయం రెండూ కలిపి రూ.7,500 జమైతే విత్తుకు ఉపయోగించుకోవచ్చని అనుకున్నాం. వారం రోజులు గడిచినా రైతు భరోసా రాలేదు.. పీఎం కిసాన్‌ అందలేదు. బ్యాంకుల వద్దకు వెళ్లి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమైందా అని రోజూ అడుగుతూనే ఉన్నాం. ఒక్క పైసా కూడా అందలేదు.

అందని పంట నష్టపరిహారం

* అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 26 జిల్లాల పరిధిలో 30,382.12 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. మొత్తం 47,999 మంది రైతులకు రూ.44.18 కోట్ల పంట నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాలకు ముఖ్యమంత్రి జమ చేశారు.  

* నంద్యాల జిల్లాలో అకాల వర్షాల కారణంగా వ్యవసాయ పంటలు 6,893.63 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. 9,204 మంది రైతులకు రూ.8.67 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి 957.62 హెక్టార్లలో నష్టం జరగ్గా.. 1,230 మంది రైతులకు రూ.1.55 కోట్ల పంటనష్ట పరిహారం విడుదలైంది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిపి మొత్తం 10,434 మంది రైతులకు రూ.10.22 కోట్ల పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేశారు.

* కర్నూలు జిల్లాలో అకాల వర్షాల కారణంగా 370.62 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు, 43 హెక్టార్లలో ఉద్యాన పంటలకు కలిపి మొత్తం 396.63 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిపి 574 మంది రైతులకు రూ.48.16 లక్షల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేశారు. అయితే రైతుల ఖాతాలకు జమ కాలేదు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే వారం, పది రోజుల్లో రైతులందరికీ పెట్టుబడి సాయం జమవుతుందని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని