logo

ముంచెత్తితే ముప్పే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయాలు ప్రమాదకరంగా మారాయి.

Updated : 08 Jun 2023 06:35 IST

ప్రమాదకరంగా జలాశయాలు

నిర్వహణకు నిధులివ్వని ప్రభుత్వం

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయాలు ప్రమాదకరంగా మారాయి. మూడేళ్లుగా నిర్వహణ వ్యయం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) కింద నిధులు విడుదల చేయడం లేదు. గేట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎప్పుడు.. ఏ ప్రాజెక్టు వద్ద...ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌, సుంకేసుల బ్యారేజి, వెలుగోడు సమతుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, అవుకు, గోరుకల్లు జలాశయాలకు నిర్వహణ నిధులు విడుదల చేయడం లేదు.

అవుకు అధోగతి

4.150 టీఎంసీల సామర్థ్యం కలిగిన అవుకు జలాశయానికి ఏర్పాటు చేసిన 6 ద్వారాల్లో రెండు ద్వారాలు గత నాలుగున్నరేళ్లుగా పనిచేయడం లేదు. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.2.50 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. మిగిలిన 4 ద్వారాల నిర్వహణకు సంబంధించి అరకొర నిధులతో లాక్కొస్తూ గండికోట జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం కింద 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. అవుకు జలాశయం నిర్వహణకు ఏళ్ల తరబడి నిధులు విడుదల కావడం లేదు.

సుంకేసుల విలవిల

* కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో 2.75 లక్షల ఎకరాలకు నీరు అందించడంతోపాటు ఎన్నో గ్రామాల దాహార్తి తీర్చే సుంకేసుల జలాశయం పరిస్థితి దయనీయంగా మారింది. 1.200 టీఎంసీ సామర్థ్యం కలిగిన సుంకేసుల ప్రాజెక్టుకు 30 ద్వారాలున్నాయి.

* ఆగస్టు నుంచి వరద నీటి ప్రవాహం ప్రారంభమవుతుంది. నాలుగు నెలల పాటు గేట్లు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. గేట్లకు ఏర్పాటు చేసిన (రోప్స్‌) తాళ్లు నాలుగు వరకు తెగిపోయాయి.

* గేట్లకు నిరంతరం గ్రీసు వేయడంతోపాటు ఆయిల్‌ మార్చుతూ ఉండాలి. ఇక్కడ సీల్‌ రబ్బర్స్‌ సరిగా లేకపోవడంతో గేట్ల నుంచి నీరు లీకవుతోంది. ఒక గేటుకు ఏర్పాటుచేసే రోప్‌ రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. గత మూడేళ్లు నిధుల జాడ లేకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు.
వెలుగోడు వినేదెవరు

కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలోని 2.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదలతోపాటు 16.950 టీఎంసీలు నిల్వ ఉండే వెలుగోడు సమతుల జలాశయం నిర్వహణ కష్టంగా మారింది. ఇక్కడి మూడు ద్వారాలకు రెగ్యులర్‌గా గ్రీస్‌, గేర్‌ ఆయిల్‌ సమకూర్చకపోవడంతో ద్వారాలు సరిగా పనిచేయక మొండికేస్తున్నాయి. ఏటా కనీసం రూ.32 లక్షలు బడ్జెట్‌ కేటాయిస్తే జలాశయం వద్ద నిర్వహణ చేసేందుకు అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.

గోరుకల్లు గోస

12.440 టీఎంసీల సామర్థ్యం కలిగిన గోరుకల్లు రిజర్వాయర్‌కు మూడు ద్వారాలున్నాయి. వీటిలో రెండు మాత్రమే పనిచేస్తుండగా.. ఒక్క గేటు నిర్మాణ దశలోనే నిలిచిపోయింది. కొత్త గేటు ఏర్పాటు చేయక.. పెండింగ్‌ గేటు నిర్మాణం పూర్తి చేయక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత నాలుగేళ్లుగా జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నప్పటికీ.. నిర్వహణ నిధుల సమస్య వేధిస్తోంది.

ముఖ్య మార్గంలో గడబిడ

* పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలుగోడు జలాశయానికి, ఎస్సార్బీసీ, ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా మూడు పాయల ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద ఏర్పాటు చేసిన ద్వారాల్లో రెండు సరిగా పనిచేయడం లేదు. ద్వారాలు కిందికి.. పైకి రాకపోవడంతో నీటి ప్రవాహం అధికంగా ఉన్నపుడు పైకెక్కి ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ద్వారాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని మెకానికల్‌ ఇంజినీర్లు గుర్తించి హెచ్చరించారు.

* రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు అందించే పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ వద్ద 10 ద్వారాలున్నాయి. వీటి ద్వారా 44 వేల క్యూసెక్కుల వరద జలాలు విడుదలవుతాయి. నిర్వహణ నిధులు విడుదల కాక మరమ్మతులు చేయకపోవడంతో నీరు లీకేజీ అవుతోంది. 5 పాత ద్వారాలకు మరమ్మతులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. మెకానికల్‌ ఇంజినీర్ల బృందం ఏటా తనిఖీలు నిర్వహించి నివేదికలు అందిస్తున్నా తీసుకుంటున్న చర్యలు శూన్యమే.

పరిశీలించి నివేదిక ఇస్తాం

కుమారస్వామి, ఈఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, వైఎస్సార్‌ జిల్లా

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, జలాశయాలను పరిశీలించి లోపాలు గుర్తించి నివేదికను సంబంధిత ఇంజినీర్లకు అందజేస్తాం.  ప్రమాదాలనూ తెలియజేస్తూ నివేదికలు ఇస్తాం.. నిర్వహణ వ్యయానికి సంబంధించి అంచనా వేసి సంబంధిత ప్రాజెక్టు ఇంజినీరుకు తెలియజేస్తాం. బడ్జెట్‌ కేటాయింపు, నిధుల విడుదల మా పరిధిలో ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని