విద్యాశాఖలో అవినీతి పాఠం
ఆదోని డిప్యూటీ డీఈవో సుకుమార్, సమగ్రశిక్ష అభియాన్ పర్యవేక్షణాధికారి కామరాజు, అటెండర్ రమేష్‌లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) దొరికిపోయిన ఉదంతం సంచలనంగా మారింది.
రూ.75 వేలు తీసుకుంటూ దొరికిన ముగ్గురు
పట్టుబడిన వారిలో ఆదోని డిప్యూటీ డీఈవో
అనిశాకు పట్టుబడిన రమేష్, కామరాజు
కర్నూలు నేరవిభాగం, విద్య న్యూస్‌టుడే : ఆదోని డిప్యూటీ డీఈవో సుకుమార్, సమగ్రశిక్ష అభియాన్ పర్యవేక్షణాధికారి కామరాజు, అటెండర్ రమేష్‌లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) దొరికిపోయిన ఉదంతం సంచలనంగా మారింది. ఆదోనికి చెందిన ఏబీఎం ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో 12 పాఠశాలలు ఉన్నాయి. కరస్పాండెంటుగా ప్రతాప్‌కుమార్‌ను నియమించమని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదోని డిప్యూటీ డీఈవో సుకుమార్, ఓర్వకల్లు, గూడూరు ఎంఈవోలతో కమిటీ ఏర్పాటుచేసి నివేదిక ఇవ్వాలని డీఈవో ఆదేశించారు. అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకుగాను ఆదోని డిప్యూటీ డీఈవో సుకుమార్ మొత్తం రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి చివరికి రూ.1.25 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. డిప్యూటీ డీఈవోకు బంధువైన కర్నూలు డీఈవో కార్యాయంలోని సమగ్రశిక్ష అభియాన్ పర్యవేక్షణాధికారి కామరాజు మధ్యవర్తిత్వం వహించాడు. తన వాటాగా రూ.25 వేలు నిర్ణయించుకున్నాడు. అడ్వాన్స్‌గా ఆదోని డిప్యూటీ డీఈవో రూ.50 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బులు ఇవ్వటం ఇష్టంలేని ప్రతాప్‌కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఈవో కార్యాలయంలో నైట్ వాచ్‌మెన్ (అటెండర్) రమేష్ రూ.75 వేలను బుధవారం రాత్రి ప్రవీణ్‌కుమార్ నుంచి తీసుకోగా మాటేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సుకుమార్, కామరాజుతోపాటు అటెండర్ రమేష్ ఈ కేసులో నిందితుడయ్యారు. ఆదోనిలో డిప్యూటీ డీఈవో సుకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ మరో బృందం అదుపులోకి తీసుకుంది. అరెస్టు చేసిన నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ దాడుల్లో తిరుపతి అదనపు ఎస్పీ దేవప్రసాద్, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, ఇంతియాజ్, వంశీ, కృష్ణయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.