వలలో విజయాలు వాలిపోవాల్సిందే!
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. ఆటల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు లభించేందుకు అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది క్రీడలు.
రాష్ట్ర, జాతీయ స్థాయే లక్ష్యంగా సాధన
పత్తికొండలో చిన్నారులకు ఉచిత శిక్షణ
కేవీకే శిబిరంలో వాలీబాల్ ఆడుతున్న బాలబాలికలు
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. ఆటల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు లభించేందుకు అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది క్రీడలు. నైపుణ్యం ఉన్నా సరైన శిక్షణ లేక చాలా మంది గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవిలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోని కేవీకే కేంద్రాల్లో ఉచితంగా వాలీబాల్ ఆటను బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు రామాంజనేయులు, ధనంజయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు సాధన చేస్తున్నారు.
న్యూస్‌టుడే, పత్తికొండ పట్టణం
మెలకువలతో నైపుణ్యం మెరుగు
పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోని కేవీకే కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో వాలీబాల్ ఆటలు బాలబాలికలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ శిబిరాలకు ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు సుమారు వంద మంది బాలబాలికలు వస్తున్నారు. శిబిరంలో బాలబాలికలు నైపుణ్యం మెరుగుపడేలా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా, రాష్ట, జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల దిశగా..
టి.గౌరిప్రియ, 9వ తరగతి
అమ్మానాన్న శారద, టి.నాగభూషణం ప్రోత్సాహంతో నేను వాలీబాల్ క్రీడను ఎంచుకున్నా. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడా. వేసవి సెలవులు ఇలా సద్వినియోగం చేసుకున్నా. చదువుతో పాటు ఆటల్లో శిక్షణ పొందుతున్నా. ఉదయం, సాయంత్రం వేసవి క్రీడా ఉచిత శిక్షణకు వస్తున్నా. శిక్షకులు ఇచ్చే మెలకువలు నేర్చుకుంటున్నా. వేసవి క్రీడా శిబిరం చాలా ఉపయోగపడుతోంది. జాతీయ స్థాయిలో రాణించేందుకు మరింత సాధన చేస్తున్నా.
భవిష్యత్తుకు ఎంతో ఉపయోగం..
ఎం.విఘ్నేష్, పదో తరగతి
మా తల్లిదండ్రులు ఎం.అనిత, ఎం.నరసింహరావు. నాన్న బార్బర్ షాపు నిర్వహిస్తున్నారు, అమ్మ కూలిపనికి వెళ్తుంది. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటకు మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉంటుంది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఉంది. వేసవి క్రీడా శిబిరంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ పొందుతున్నా. శిక్షకులు నేర్పించే మెలకువలను బాగా నేర్చుకుంటున్నా.
బాలల్లో నైపుణ్యం వెలికితీస్తాం
రామాంజనేయులు, శిక్షకుడు, పత్తికొండ
గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికలకు ఆటలపై మక్కువ ఉంది. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు వారికి చాలా ఉపయోగపడుతున్నాయి. శిబిరాలకు వచ్చే బాలబాలికల్లో దాగిఉన్న నైపుణ్యం వెలికితీస్తాం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రత్యేకంగా మెలకువలు నేర్పించి తీర్చిదిద్దేలా చేస్తున్నాం. శిబిరాలకు ఉదయం, సాయంత్రం విద్యార్థులు బాగా వస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన శిక్షణలో విద్యార్థులు ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.