logo

బహుళ బాదుడు

గుడిసె నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు అన్ని రకాల నిర్మాణాల విలువను ప్రభుత్వం పెంచేసింది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం వేస్తోంది.

Updated : 10 Jun 2023 04:17 IST

భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్‌ రుసుములు
ఉమ్మడి జిల్లాపై  రూ.20 కోట్ల భారం

నిర్మాణంలో ఉన్న భవనం

గుడిసె నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు అన్ని రకాల నిర్మాణాల విలువను ప్రభుత్వం పెంచేసింది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం వేస్తోంది. కొంతకాలం కిందటే భూముల విలువను పెంచిన సర్కారు తాజాగా కట్టడాల మార్కెట్‌ విలువను సవరించడంతో ప్రజలపై పిడుగు పడ్డట్లయింది. నివాస, వాణిజ్య కట్టడాలకు వేర్వేరుగా వడ్డించనున్నారు. తాజాగా పెంపుతో ఉమ్మడి జిల్లాలో భవనాల క్రయ, విక్రయాలు జరిపే వారిపై ఏడాదికి రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడనుంది.

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

వాణిజ్య ప్రాంతాల వారీగా వడ్డింపు

ఉమ్మడి జిల్లాలో ఈసారి వాణిజ్య ప్రాంతాల వారీగా ధరలు పెంచారు. బహుళ అంతస్తులకు సంబంధించి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు రూ.1,700, మొదటి అంతస్తుకు రూ.1,600, రెండో అంతస్తుకు రూ.1,500, సెల్లార్‌, పార్కింగ్‌ స్థలానికి రూ.1,000 చొప్పున పెంచారు. పట్టణం, మేజర్‌, మైనర్‌ పంచాయతీలకు సంబంధించి విలువ ఆధారంగా పెంచారు. పెరిగిన ధరల ప్రకారం 6.5 శాతం రిజిస్ట్రేషన్‌ రుసుము, స్టాంపు డ్యూటీ వసూలు చేయనున్నారు.

అసంపూర్తి నిర్మాణాలకూ...

మట్టిమిద్దెలకు ప్రస్తుతం ఉన్న ధర కంటే చదరపు అడుగుకు రూ.10 పెంచారు. అసంపూర్తి నిర్మాణాలకు సంబంధించి పునాది దశలో ఉంటే 25 శాతం, శ్లాబ్‌ స్థాయిలో ఉంటే 65 శాతం, నిర్మాణ చివరి దశలో ఉంటే 85 శాతం చొప్పున వసూలు చేస్తారు. ఆర్‌సీసీ నిర్మాణాలకు పది అడుగుల ఎత్తుకు పైగా ఉంటే చదరపు అడుగుకు రూ.800 చొప్పున, మల్టీఫ్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌కు రూ.1,500 చొప్పున వసూలు చేస్తారు.

గ్రామాల్లోనూ  పెంచారు

కర్నూలు కార్పొరేషన్‌, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పురపాలక సంఘాల్లో చదరపు అడుగు ప్రస్తుతం రూ.1,200 ఉండగా దీన్ని రూ.1,400 చేశారు. గూడూరు, బేతంచెర్ల, బనగానపల్లి, కోవెలకుంట్ల వంటి నగర పంచాయతీల పరిధిలో ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.1,060 ఉండగా రూ.1,200కు పెంచారు. గ్రామాల్లో రూ.770 నుంచి రూ.850కు పెంచారు.

అడుగు విలువ పెంచి.. అదనంగా దోచి

ఉమ్మడి జిల్లాలోని 950కు పైగా గ్రామాల్లో ఉన్న అన్నిరకాల భవనాలపై రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చదరపు అడుగుకు రూ.80 పెంచారు. కర్నూలు కార్పొరేషన్‌లో 2 వేల అడుగుల సాధారణ భవనాన్ని కొనుగోలు చేస్తే గతంలో చదరపు అడుగు విలువ రూ.1200 ప్రకారం స్థిరాస్తి విలువ రూ.24 లక్షలు కాగా, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ రూ.1.80 లక్షలు అయ్యేది. తాజాగా చదరపు అడుగు విలువ రూ.1400కు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ ఛార్జీ రూ.2.10 లక్షలు కానుంది. ఈ ప్రకారం కొనుగోలు చేసిన వ్యక్తిపై రూ.30 వేలు అదనపు భారం పడనుంది. గూడూరు, బేతంచెర్ల వంటి నగర పంచాయతీల్లో చదరపు అడుగు విలువ రూ.140 పెరిగింది. ఈ ప్రకారం ఇక్కడ వెయ్యి చదరపు అడుగుల్లో భవనాన్ని కొనుగోలు చేస్తే గతంలో రూ.10.60 లక్షలు ఉన్న స్థిరాస్తి విలువ ప్రస్తుతం రూ.12 లక్షలకు పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ఛార్జి రూ.90 వేలు కానుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు