logo

కండలు.. గెలుపు దండలు

నేటితరం విద్యార్థులు, యువత సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వివిధ క్రీడలు, కళలు నేర్చుకుని ప్రతిభ చాటుతున్నారు.

Published : 10 Jun 2023 02:46 IST

రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌లో రాణిస్తున్న ముకుంద

బహుమతి అందుకుంటున్న ముకుంద

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : నేటితరం విద్యార్థులు, యువత సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వివిధ క్రీడలు, కళలు నేర్చుకుని ప్రతిభ చాటుతున్నారు. పోటీల్లో విజయాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు. నంద్యాలకు చెందిన ముకుంద కూడా ఇదేవిధంగా తనకు ఇష్టమైన బాడీ బిల్డింగ్‌పై దృష్టిపెట్టాడు. ఎనిమిది పలకల దేహాన్ని సాధించడంతో పాటు బాడీ బిల్డింగ్‌లో రాణించాలన్న పట్టుదలతో కసరత్తు చేస్తున్నాడు. ఏడాదిలోనే రాష్ట్రస్థాయిలో జరిగిన పలు పోటీల్లో సత్తాచాటి విజయ పథంలో సాగుతున్నాడు.

* నంద్యాల పట్టణం గాంధీచౌక్‌కు చెందిన దామోదర్‌, జయశ్రీ దంపతుల కుమారుడు ముకుంద. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఖాళీ సమయాల్లో దేహ దారుఢ్యం కోసం వ్యాయామశాలకు వెళ్లి కసరత్తులు చేసేవాడు. ఇంటర్‌ చదువుతున్నప్పటి నుంచి వ్యాయామశాలకు క్రమం తప్పకుండా వెళ్లేవాడు. తాను కోరుకున్న విధంగా శరీరాన్ని తీర్చిదిద్దుకున్న ఈ యువకుడు గతేడాది నుంచి పోటీల్లో పాల్గొంటున్నాడు. చదువుతో పాటు కిరాణా దుకాణంలో తండ్రికి సహాయ పడుతూనే లక్ష్య సాధన కోసం వ్యాయామ శాలలో రోజుకు 6 గంటల పాటు కసరత్తులు చేస్తున్నాడు. జాతీయస్థాయిలో విజయాలే లక్ష్యంతో శ్రమిస్తున్నట్లు చెబుతున్నాడు ముకుంద.

పోటీల్లో ప్రతిభ చాటు

సాధించిన విజయాలు..

* 2022 మార్చిలో తిరుపతిలో జరిగిన మిస్టర్‌ ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నాడు.

* 2022 జులైలో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో తృతీయస్థానం సాధించాడు.

* 2022 సెప్టెంబరులో కడపలో మిస్టర్‌ ఆంధ్ర సంస్థ వారు నిర్వహించిన పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి నగదు బహుమతి గెలుపొందాడు.

* 2022 అక్టోబరులో రాయచూర్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానం, ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచాడు.

* 2022 నవంబరులో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచాడు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని