logo

ఆహార శిక్షణ.. ఆరోగ్య రక్షణ

ఆధునిక జీవనంలో మానసిక ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు.

Published : 10 Jun 2023 02:46 IST

చిరుధాన్యాలతో వంటకాల తయారీ
బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో తర్ఫీదు

శిక్షణ పొందుతున్న మహిళలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఆధునిక జీవనంలో మానసిక ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. శారీరక శ్రమ తగ్గి చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. దీనికితోడు సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో మహిళలు, యువతులకు సంప్రదాయ వంటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆహారపు అలవాట్ల మార్పునకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

నెల రోజులపాటు..

బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో దాదాపు 50కిపైగా మహిళలకు వివిధ వంటకాల తయారీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, పెద్దకడబూరు, కోసిగి, మంత్రాలయం మండలాలవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజూ ఉదయం గంటపాటు నెల రోజులు ఈ కార్యక్రమం సాగుతుంది. రాగి పిండితో తయారు చేసిన చుట్లు, మిక్స్చర్‌, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, అరికెలు, సామలు వంటి వాటితో తీపి పదార్థాలు తయారు చేస్తారు. అరికెలు, మిల్లెట్స్‌ బిస్కెట్లు, తీపి పదార్థాలు, మురుకులు, జిలేబీ, రాగులతో లడ్లు, ఇతర వంటకాలు తయారు చేయడం నేర్పిస్తున్నారు.

స్వీట్లు, ఇతర పదార్థాలు నేర్చుకున్నాను

 జయశ్రీ, ఎమ్మిగనూరు

నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ చదువుతున్నా. ఇంట్లో వంటకాలు తయారు చేసి మంచి ఆరోగ్యమైన వంటను అందించాలని ఇక్కడకు వచ్చాను. 15 రోజుల నుంచి ఇక్కడ శిక్షణలో పాల్గొంటున్నాను. చిరుధాన్యాలతో తయారు చేసి స్వీట్లు, ఇతర పదార్థాలను నేర్చుకున్నాను. బిస్కెట్లు, ఇతర పదార్థాలు ఎలా తయారు చేయాలో తర్ఫీదు ఇస్తున్నారు.

ఇతరులకు అవగాహన కల్పిస్తాను

మణికుమారి, యువతి, ఎమ్మిగనూరు

ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. చిరుధాన్యాలతో వంటకాలు నేర్చుకోవడం ఎంతో ఇష్టం. మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను మన ఆహారంలో భాగంగా మార్చుకోవాలి. చిరుధాన్యల్లో భాగంగా లడ్డు, కారాలు, గింజలు, మురకలు, ఇతర వంటకాలు నేర్చుకున్నా. ఈ వంటలపై ఇతరులకు అవగాహన కల్పిస్తాను.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని