logo

ఆర్‌యూలో అధనంగా ధారపోత

రాయలసీమ విశ్వవిద్యాలయంలో 170 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 105 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.

Published : 10 Jun 2023 02:46 IST

పరిపాలన నిధుల నుంచి వేతనాలు
ప్రభుత్వ ఉత్తర్వులు బుట్టదాఖలు

రాయలసీమ విశ్వవిద్యాలయంలో 170 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 105 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఏపీ ఆప్‌కాస్‌ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అలాకాకుండా ఆర్‌యూ పరిపాలన నిధుల నుంచి ఏటా సుమారు రూ.5 కోట్ల మేర ధారబోస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకపోయినా పోస్టులు సృష్టించి రూ.వేలకు వేలు జీతాలు ఇస్తుండటం గమనార్హం.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య

ట్రెజరీలో నిలిపివేత

105 మంది ఉద్యోగుల వేతనాల కోసం ప్రతి నెలా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి వివరాలు పంపుతున్నారు. ట్రెజరీ అధికారులు వీటిని తిరస్కరిస్తున్నారు. ఉద్యోగుల పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రతి నెలా ట్రెజరీ అధికారులు కోరుతూనే ఉన్నారు. అయినా ఆర్‌యూ నుంచి స్పందన లేకపోవడంతో గత 8 నెలలుగా ట్రెజరీ అధికారులు వేతనాలు నిలిపివేసినట్లు సమాచారం. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌యూ ఈసీ కమిటీ పరిపాలన నిధుల నుంచి వేతనాలు చెల్లించేలా తీర్మానం చేయడం గమనార్హం.

లోకాయుక్త.. సీఐడీకి ఫిర్యాదు

* కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలపై ఆర్‌యూ పాలక మండలిలో తీర్మానం తీసుకునే అధికారం లేదని 2003లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నిబంధన ప్రకారం 26 మందినే తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఉన్న ఏ వర్సిటీలో లేనివిధంగా నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉండటం గమనార్హం. వీరికి వేతనాల చెల్లింపును.. 2008లో జారీ అయిన జీవో నంబరు 56 ప్రకారం చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వేతనాలు చెల్లిస్తే బేసిక్‌ ఇవ్వాలి.

* నిబంధనలు తుంగలో తొక్కి రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే బేసిక్‌తోపాటు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ చెల్లించడంపై కొందరు విద్యార్థి సంఘం నాయకులు సీఐడీ, లోకాయుక్తలోనూ చేశారు. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలని లోకాయుక్త, సీఐడీ నుంచి ఆర్‌యూ పరిపాలన అధికారులకు నోటీసులు వచ్చినట్లు తెలిసింది.

ఉత్తర్వులు ఏం చెబుతున్నాయి

నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు వేతనాలు చెల్లిస్తామని యోగి వేమన, విక్రమ సింహపురి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని కోరాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు వేతనాలు చెల్లించే అవకాశం లేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇదే విషయమై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వు సైతం జారీ చేసింది. అయినప్పటికీ ఆర్‌యూలో మాత్రమే బోధనేతర సిబ్బందికి రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు వేతనాలు చెల్లిస్తుండటం గమనార్హం.

నిబంధన మేరకే ముందుకు

సుందరానంద, రిజిస్ట్రార్‌, ఆర్‌యూ

ఆర్‌యూలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈసీ కమిటీ నిర్ణయం మేరకు వేతనాలు చెల్లిస్తున్నాం. ఆర్‌యూలో జరిగే ప్రతి అంశంపై పాలక మండలిలో తీర్మానించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ధ్రువపత్రాల విషయాన్ని పరిశీలించి 17 మందిని విధుల నుంచి తొలగించాం. మిగిలిన సిబ్బందికి చెందిన పత్రాలు జిల్లా విద్యాశాఖ పరిశీలనలో ఉన్నాయి. అక్కడినుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఈసీ సమావేశంలో పెట్టి ఉన్నతాధికారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని