logo

సాంకేతిక తోటలో సమస్యల మేట

కర్నూలు నగర పరిధిలోని జగన్నాథగట్టుపై సాంకేతిక విద్య అందిస్తున్న ట్రిపుల్‌ ఐటీ డీఎంలో సమస్యలు తిష్ఠవేశాయి. ఈనెల 23న ఐదో స్నాతకోత్సవం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 21 Sep 2023 06:14 IST

విద్యార్థులకు కరవైన రక్షణ
ముగ్గురు ప్రొఫెసర్లదే తుది నిర్ణయం
న్యూస్‌టుడే, కర్నూలు విద్య

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోని వసతిగృహాలు

ర్నూలు నగర పరిధిలోని జగన్నాథగట్టుపై సాంకేతిక విద్య అందిస్తున్న ట్రిపుల్‌ ఐటీ డీఎంలో సమస్యలు తిష్ఠవేశాయి. ఈనెల 23న ఐదో స్నాతకోత్సవం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు సాంకేతిక విద్య నేర్చుకుంటున్నారు. క్యాంపస్‌ కొండప్రాంతంలో ఉండడంతో ఇక్కడ నెలకొంటున్న సమస్యలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆ ముగ్గురు ప్రొఫెసర్ల పాత్ర కీలకంగా ఉందని పలువురు ట్రిపుల్‌ ఐటీ డీఎం ఛైర్మన్‌ రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆ ముగ్గురు ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి ఆ ముగ్గురు ప్రొఫెసర్లకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆహారం వికటించి అస్వస్థత

ట్రిపుల్‌ ఐటీ డీఎంలో చదువుకుంటున్న విద్యార్థులకు రక్షణ కరవైందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై డైరెక్టర్‌ సోమయాజులను నేరుగా కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడం గమనార్హం. క్యాంపస్‌లో విద్యార్థులకు, విద్యార్థినులకు వేర్వేరుగా వసతిగృహాలున్నాయి. ఆహారం నాణ్యతగా లేక పలుమార్లు హాస్టల్‌ వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై ప్రశ్నించిన పదిమంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో చేసేది లేక వసతిగృహంలో నాణ్యతగా లేని భోజనమే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు దిక్కైంది. ఆరు నెలల కింద ఆహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గతంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.

అధ్వానంగా ఉన్న ట్రిపుల్‌ ఐటీ ప్రధాన రహదారి

ప్రారంభం నుంచి నీటి ఎద్దడి

ట్రిపుల్‌ ఐటీలో ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, శాస్త్రవేత్తలు అక్కడే నూతనంగా నిర్మించిన భవనాల్లో ఉంటున్నారు. వీరికి సరిపడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నగరపాలక అధికారులు స్వయంగా ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను సందర్శించారు. ఇక్కడ నెలకొన్న నీటి సమస్య గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు.


విద్యార్థులకు రక్షణ కల్పిస్తాం
- గురుమూర్తి, ట్రిపుల్‌ ఐటీ డీఎం, రిజిస్ట్రార్‌

క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలుంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. భోజన విషయంలో మరోసారి కమిటీ వేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని