logo

నాడు కట్టమన్నారు.. నేడు వద్దంటున్నారు

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘‘మన బడి నాడు- నేడు’’ పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. ఎంతకీ పూర్తికావడం లేదు.. దీంతో ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని పాఠశాలల్లో పనులు చేపట్టవద్దని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Updated : 21 Sep 2023 06:13 IST

పురోగతి లేకుంటే నిధులు వెనక్కి
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పనులు

చాపిరేవుల ప్రత్యేక పాఠశాలలో అసంపూర్తిగా నిర్మాణం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘‘మన బడి నాడు- నేడు’’ పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. ఎంతకీ పూర్తికావడం లేదు.. దీంతో ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని పాఠశాలల్లో పనులు చేపట్టవద్దని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది. మన బడి నాడు- నేడు రెండో విడత కింద ఉమ్మడి జిల్లాలో 952 పాఠశాలలను ఎంపిక చేశారు. 312 పాఠశాలల్లో 991 అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు, 415 ప్రహరీలకు కలిపి రూ.365.75 కోట్లు విడుదల చేశారు. మరో రూ.45 కోట్ల వరకు రావాల్సి ఉంది. కొన్నిరోజుల కిందట రూ.4 కోట్లు వచ్చాయి. వారం కిందట మరో రూ.5 లక్షలు విడుదలయ్యాయి. రెండు జిల్లాల పరిధిలో ఒక్కో పాఠశాలలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కొరతతో పనులు చాలాచోట్ల సగంలోనే ఆగిపోయాయి.

నిధులు సర్దుపాట్లు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నిధుల సర్దుబాటుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు పాట్లు పడుతున్నారు. సగం చోట్ల నిధులు, పనుల వివరాలను కంప్యూటర్‌ స్వీకరించడం లేదు. ఇది ప్రధానోపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. సగం పనులు పూర్తయిన చోట్ల నిధులు మిగిలితే వాటిని అవసరం ఉన్న పాఠశాలలకు మళ్లించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు చాలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగీకరించడం లేదు. ఆడిట్‌ సమయంలో ఇబ్బందులు వస్తాయనే భావనలో వారు ఉన్నారు. కంప్యూటర్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయలేక ఎంఈవోలు సతమతమవుతున్నారు.

ఆరా తీస్తున్న అధికారులు

  • ఎక్కడెక్కడ పనులు జరగలేదు.. ఎన్నిచోట్ల సగం వరకే పూర్తి చేశారు.. తదితర వివరాలను ఎంఈవోలు సేకరిస్తున్నారు. ఇసుక లభ్యత లేకపోవడం, సకాలంలో నిధులు రాకపోవడం, వేసవి సెలవులు తదితర కారణాలతో రెండో విడత పనులు చాలా పాఠశాలల్లో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సగం పనులే జరిగిన చోట ఏమైనా నిధులు మిగిలుంటే వాటిని ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసే యోచనలో భాగంగా ప్రధానోపాధ్యాయుల నుంచి ఎంఈవోలు వివరాలు ఆరా తీస్తున్నారు.
  • గత విద్యా సంవత్సరం ప్రవేశాల ఆధారంగా ఈ ఏడాది మార్చిలో ఉమ్మడి జిల్లాలోని 312 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం చాలా పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గాయి. ఎన్ని అదనపు గదులు అవసరమో గుర్తించి ఆ మేరకు నిర్మించాలని తాజా ఆదేశాలు వెలువడ్డాయి. వాటి వివరాలు ఆన్‌లైన్‌లో ఎలా పొందుపరచాలో తెలియక ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు.

పిల్లలు లేరు కదా వెనక్కి ఇవ్వండి

  • నంద్యాల మండలం పాండురంగాపురం ఎంపీయూపీ పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు రూ.12 లక్షల నిధులొచ్చాయి. ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. పిల్లలు తక్కువగా ఉన్నారు కాబట్టి మిగిలిన నిధులు వెనక్కి పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ పాఠశాల నుంచి సుమారు రూ.1.50 లక్షలు వెనక్కి పంపించారు. దీనికి సమీపంలోనే చాపిరేవుల గ్రామంలో ఉన్న స్పెషల్‌ స్కూల్‌లో 57 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ అదనపు గదుల నిర్మాణంలో భాగంగా పైకప్పు పనులు జరుగుతున్నాయి. రూ.2.50 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయి. అధికారుల ఆదేశాలతో ప్రస్తుతం ఈ నిధులు వెనక్కి పంపాలనుకుంటున్నారు.
  • మహానంది, బండిఆత్మకూరు, ఓర్వకల్లు, గడివేముల, హాలహర్వి, తుగ్గలి, మద్దికెర, మంత్రాలయం, కోసిగి, ఉయ్యాలవాడ, చాగలమర్రి మండలాల్లోని 43 పాఠశాలల్లో 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆయాచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఈ మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో కొన్ని గదులే నిర్మించాలని తాజాగా భావిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని