logo

చెరువుకు చేరని నీరు

ఇక్కడ నిల్వ ఉన్న నీటిని చూసి చెరువు అనుకుంటే మీరు నీళ్లల్లో కాలేసినట్లే. ఇది డోన్‌ మండలంలోని ఉడుములపాడు జగనన్న కాలనీ. వర్షమే కురవలేదు..

Published : 21 Sep 2023 02:27 IST

అసంపూర్తి పనులతో అవస్థలు
జగనన్న కాలనీకి దారి మళ్లిన వైనం

ఇక్కడ నిల్వ ఉన్న నీటిని చూసి చెరువు అనుకుంటే మీరు నీళ్లల్లో కాలేసినట్లే. ఇది డోన్‌ మండలంలోని ఉడుములపాడు జగనన్న కాలనీ. వర్షమే కురవలేదు.. ఇంత పెద్ద ఎత్తున నీళ్లు ఎలా వచ్చాయో ఆశ్చర్యంగా ఉంది కదూ. హంద్రీ నీవా కాల్వ నుంచి 77 చెరువులకు నీటిని విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఊదరగొట్టారు. జగదూర్తి చెరువుకు చేరాల్సిన నీరు ఇలా కాలనీని ముంచెత్తింది. కాల్వ పరిస్థితి సరిగా లేకపోవడంతో నీరు దారి మళ్లి జగనన్న కాలనీలోకి ప్రవహించింది. కుంటను తలపించేలా నీరు నిల్వ ఉండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనులు పూర్తి చేయకుండానే పథకానికి ప్రారంభోత్సవం చేశారనడానికి ఇది చక్కని నిదర్శనం.

డోన్‌ , డోన్‌ గ్రామీణం న్యూస్‌టుడే: ‘‘ రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా.. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి చేసేందుకు శ్రీకారం చుట్టాం. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రధాన కాల్వ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు 77 చెరువులు నింపే కార్యక్రమం చేపట్టినట్లు’’ డోన్‌ మండలం వెంకాయపల్లిలో మంగళవారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గొప్పగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, కృష్ణగిరి, డోన్‌, ప్యాపిలి, వెల్దుర్తి తదితర మండలాల్లోని 68 చెరువుల్లో హంద్రీ నీవా కాల్వ ద్వారా కృష్ణాజలాలు తరలించాలని తెదేపా హయాంలోనే నిర్ణయించారు. 10,130 ఎకరాలకు సాగు, 57 గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. అప్పటి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చొరవ తీసుకొని రూ.224.31 కోట్లతో పాలనాపరమైన ఉత్తర్వులు విడుదల చేయించారు. 2019 ఎన్నికల నాటికి 40 శాతం పనులు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మరో 9 తటాకాలను ఈ పథకం జాబితాలో చేర్చి పనులు పూర్తి చేస్తామని చెప్పింది. పనులు మాత్రం తాత్సారం చేస్తూ వచ్చారు. ఇప్పటికీ పైపులైన్‌ పనులే పూర్తి కాలేదు. ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో హడావుడిగా నీటి విడుదల ప్రారంభించారు. పనులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఎక్కడికక్కడ నీళ్లు ‘దారి’ మళ్లుతున్నాయి.

ట్రయల్‌ రన్‌లో గుర్తించినా

పథకంలో భాగంగా డోన్‌ మండలం అబ్బిరెడ్డిపల్లె, ఉడుములపాడు, జగదూర్తి చెరువులకు నీటిని అందించాల్సి ఉంది. వాటి పరిధిలో సాగుభూమి ఎక్కువగా ఉంది. అబ్బిరెడ్డిపల్లె చెరువు కింద దాదాపు 2 వేల ఎకరాల వరకు సాగవుతోంది. జగదూర్తికి చెరువుకు ఉడుములపాడు సమీపంలోని జగనన్నకాలనీ వద్ద చేపట్టిన పైపులైన్‌ ద్వారా కొంత దూరం వెళ్లి చిన్నపాటి వాగులో కలిసి చెరువుకు చేరాల్సి ఉంటుంది. పనులు పూర్తికాకపోవడంతో నీళ్లు జగనన్నకాలనీకి దారి మళ్లాయి. అధికారులు హడావుడిగా పనులు చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ట్రయల్‌రన్‌లో సమస్య ఎదురైనా అధికారులు పరిష్కరించలేదు. ఈ విషయమై ఏఈ వెంకటేశ్‌నాయక్‌ మాట్లాడుతూ ఉడుములపాడు చెరువు వైపు వెళ్లే పైపులైన్‌కు నీటి విడుదల నిలిపివేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని