logo

మహిళకు మకుటం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వారే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తున్నారు.

Updated : 21 Sep 2023 06:13 IST

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌
లోక్‌సభలో ఆమోద ముద్ర
ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

మ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వారే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. ఆకాశంలో సగం.. అభ్యర్థుల గెలుపులో కీలకం అంటూ రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లకు గాలం వేస్తున్నాయి.. తప్పితే వారిని బరిలో నిలిపేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర పడింది.


పార్లమెంటులో ఇద్దరే

1952 నుంచి ఇప్పటివరకు ఏడు దశాబ్దాల కాలంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్‌ నుంచి ఇద్దరే మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. 1962లో కర్నూలు పార్లమెంటు నుంచి యశోదారెడ్డి (కాంగ్రెస్‌), 2014లో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక (వైకాపా) గెలుపొందారు.


శాసనసభలో ఏడుగురే

శాసనసభలో కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచి అడుగుపెట్టారు. మొట్టమొదటగా సుబ్బరత్నమ్మ (పత్తికొండ), శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ), కోట్ల సుజాతమ్మ (డోన్‌), నీరజారెడ్డి (ఆలూరు), గౌరు చరితారెడ్డి (పాణ్యం), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), కంగాటి శ్రీదేవి (పత్తికొండ) ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఉమ్మడి జిల్లాలో నలుగురు మహిళలు శాసనసభకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.


10 నియోజకవర్గాల్లో కీలకం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కర్నూలు, పాణ్యం, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లి, డోన్‌ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వారే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తున్నారు.


స్థానిక సంస్థల్లో 50 శాతం అమలు

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 మంది జడ్పీటీసీ సభ్యులు ఉండగా 26 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. 804 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందులో 342 మంది పురుషులు, 462 మంది మహిళలు ఉన్నారు. ఎంపీపీలు 53 మందికిగాను 26 మంది పురుషులు, 27 మంది మంది మహిళలు ఉన్నారు.
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో 970 గ్రామ పంచాయతీలుండగా 485 మంది పురుషులు, 485 మంది మహిళలు సర్పంచులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  9,984 మంది వార్డు సభ్యులుండగా పురుషులు 4,992, మహిళలు 4,992 మంది ఉన్నారు.

అమలు అప్పుడే

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2026లో డీలిమిటేషన్‌ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029లోనే పార్లమెంటులో కోటా అమలయ్యే అవకాశముంది. 2026లో డీలిమిటేషన్‌ పూర్తయితే ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసే అవకాశముంది.


శుభపరిణామం
గౌరు చరితారెడ్డి,  మాజీ ఎమ్మెల్యే

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం శుభపరిణామమే. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. ఈ బిల్లు ద్వారా సాధారణ మహిళలు సైతం చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం దక్కుతుంది.


1996 నుంచి పోరాటం
- పి.నిర్మల, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  

1996 నుంచి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టం చేయాలని పలు రూపాల్లో పోరాడుతున్నాం. భాజపా గతంలో రెండుసార్లు దేశాన్ని పరిపాలించింది. ఆనాడు మహిళా బిల్లును ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  హడావుడిగా మహిళా బిల్లును పెట్టింది.


ప్రాతినిధ్యం పెరుగుతుంది
బైరెడ్డి శబరి, భాజపా, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు

27 ఏళ్ల తర్వాత పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమే. కొత్త పార్లమెంట్‌ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా బిల్లు కావడం సంతోషకరం. మహిళలు వంటింటికే పరిమితం కారాదు. చట్టసభల్లో మూడో వంతు మహిళా సభ్యులు ఉండనున్నారు. దేశంలోని మహిళలంతా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపాలి. మహిళా బిల్లును ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ప్రధాని ఒక మోడల్‌గా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని