logo

ప్రతిభకు ఆటంకం

స్కూల్‌గేమ్స్‌ షెడ్యూలు ప్రకారం ఏటా 29 క్రీడాంశాలపై (గుర్తింపు పొందినవి) మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలి.

Published : 22 Sep 2023 02:47 IST

స్కూల్‌ గేమ్స్‌కు నిధులివ్వని ప్రభుత్వం
దాతలు, విద్యార్థుల నుంచి వసూలు

క్రీడా దుస్తులు లేకుండానే ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 హ్యాండ్‌బాల్‌ పోటీలో తలపడుతున్న క్రీడాకారులు

కర్నూలు క్రీడలు, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: స్కూల్‌గేమ్స్‌ షెడ్యూలు ప్రకారం ఏటా 29 క్రీడాంశాలపై (గుర్తింపు పొందినవి) మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) కార్యదర్శుల సమక్షంలో వీటిని నిర్వహిస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన వారికి వివిధ కోర్సులు, ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. దీంతో గ్రామీణ క్రీడాకారులు స్కూల్‌ గేమ్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తారు. వీటి నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైసా విదిల్చడం లేదు. జిల్లా స్కూల్‌గేమ్స్‌ నిర్వహణ భారం తాము మోయలేమంటూ ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-14, 17, 19 కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు. ఎలాగైనా నిర్వహించాల్సిందేనని పెద్దలు ఒత్తిడి చేయడంతో దాతలు, విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.

2014 నుంచి 2019 వరకు సాఫీగా

మండలస్థాయి పోటీలు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేల నుంచి రూ.50 వేలు, జిల్లాస్థాయిలో రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు, రాష్ట్రస్థాయి పోటీలకు రూ.3 లక్షలకుపైగా ఖర్చవుతుంది. మొదట జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు వెచ్చించేవారు. పోటీలు ముగిసిన ఆరునెలల లోపు బిల్లులు పెట్టుకుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఎలాంటి ‘ఆటంకం లేకుండా క్రీడలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించడం లేదు. 2019లో పోటీలు నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు నిధుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఓ కార్యదర్శి ‘న్యూస్‌టుడే’ ఎదుట వాపోయారు.


నేడు

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) పోటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. గతేడాది షెడ్యూలు ప్రకారం పోటీలు నిర్వహించకపోవడంతో క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లిలేకపోయారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోడంతో పోటీలు నిర్వహించేందుకు ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో దాతలను ఆశ్రయిస్తున్నారు.


నాడు

తెదేపా హయాంలో స్కూల్‌ గేమ్స్‌కు వచ్చే ప్రతి క్రీడాకారుడి రవాణా, భోజనం, దుస్తులు, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు, పతకాలు, క్రీడా పత్రాల ముద్రణ తదితర వాటికి సంబంధించి అయ్యే ఖర్చులు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు భరించేవారు. అనంతరం బిల్లులు సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేది. పోటీలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోపే నిధులు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శుల ఖాతాల్లో జమయ్యేవి.


నాలుగేళ్లుగా కొరవడిన ప్రోత్సాహం

ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల తాలూకా స్థాయి పోటీలు నిర్వహించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, త్రోబాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, చదరంగం తదితర పోటీలు జరిగాయి. నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల నుంచి 500 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతో వ్యాయామ ఉపాధ్యాయులే తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. క్రీడాకారులు సొంతంగా రవాణా ఖర్చులు భరించారు. కనీసం నీళ్ల ప్యాకెట్లు ఇవ్వలేదు. క్రీడా కోడ్‌ ప్రకారం ఆటగాళ్లు ప్రత్యేక దుస్తులు ధరించి పోటీలో దిగాలి. కానీ చాలా మంది సాధారణ దుస్తులు ధరించి బరిలోకి దిగారు. దాతల సాయంతో ప్రారంభ, ముగింపు వేడకలు, క్రీడా పత్రాలు ముద్రిస్తున్నారు. ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడా పోటీల్లో పాల్గొనేవారిని ప్రోత్సహిస్తూ ఇచ్చే పతకాలను గత నాలుగేళ్లుగా ఇవ్వకపోవడం గమనార్హం.


ఆటగాళ్లను ఆదుకోవాలి : చంద్రశేఖర్‌, నందవరం

ఎమ్మిగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. నాన్న ఆర్‌ఎంపీ. అమ్మ మగ్గం పని చేస్తూ బతికిస్తున్నారు.ఫుట్‌బాల్‌పై మక్కువతో వారంలో మూడు రోజులపాటు ఎమ్మిగనూరులోని మైదానంలో తర్ఫీదు పొందుతున్నా. గోల్‌ కీపర్‌గా రాణిస్తున్నా. 2022లో కర్నూలులో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యా. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పోటీల్లో రాణించి క్రీడా అవార్డు గెలుచుకున్నా. 2019లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. అథ్లెటిక్స్‌ విభాగంలో మండల స్థాయిలో ఎంపికై జిల్లా స్థాయి జట్టు కోసం సాధన చేస్తున్నా. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తిగా కొరవడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని