logo

పతకాలు దిగిరావాల్సిందే

వారు మైదానంలో అడుగు పెడితే పతకాలు వచ్చి వాలాల్సిందే. ఆడే క్రీడపై శ్రద్ధ.. మెలకువలు తెలుసుకోవాలనే ఆసక్తి విజయాల వైపు నడిపిస్తోంది.

Updated : 22 Sep 2023 05:47 IST

ఆదోని క్రీడాకారుల ప్రతిభ

వారు మైదానంలో అడుగు పెడితే పతకాలు వచ్చి వాలాల్సిందే. ఆడే క్రీడపై శ్రద్ధ.. మెలకువలు తెలుసుకోవాలనే ఆసక్తి విజయాల వైపు నడిపిస్తోంది. అండర్‌-14 క్రీడా విభాగంలో ఆదోని పట్టణానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో రాణిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కీర్తన్‌ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతుండగా.. చేతనశ్రీ ఫుట్‌బాల్‌లో గోల్‌ కీపర్‌గా రాణిస్తోంది. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి.. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల విజయంపై న్యూస్‌టుడే కథనం.

 న్యూస్‌టుడే, ఆదోని విద్య


కీర్తన్‌.. ప్రత్యేకత చాటెన్‌

ఆదోని పట్టణం ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న బి.లింగన్న, గీతా దంపతుల కుమారుడు కీర్తన్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు ముజాయిద్దిన్‌ వద్ద అథ్లెటిక్స్‌ క్రీడలపై కీర్తన్‌ సాధన చేస్తున్నాడు. పరుగు పందెం కోసం రోజూ సాధన చేస్తున్నాడు. ఇటీవల కర్నూలు నగరంలో కర్నూలు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో భాగంగా విద్యార్థి కీర్తన్‌ అండర్‌-14 విభాగంలో వంద మీటర్ల పరుగు పందెంలో ప్రాతినిధ్యం వహించి జిల్లాలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలనేది తన లక్ష్యమని, వ్యాయామ ఉపాధ్యాయుడు ముజాయిద్దిన్‌ సూచనలతో సాధన చేస్తూ ప్రతిభ చాటుతానని పేర్కొంటున్నాడు విద్యార్థి కీర్తన్‌.


శెభాష్‌ చేతనశ్రీ..

ఆదోని పట్టణానికి చెందిన బి.వెంకటేశు, ప్రసన్నలక్ష్మి కుమార్తె చేతనశ్రీ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫుట్‌బాల్‌ క్రీడపై ఆసక్తితో కోచ్‌ మస్తాన్‌వలి, షాషావలి దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. నిత్యం సాధన చేస్తోంది. ఇటీల అనంతపురం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ మీట్‌లో కర్నూలు జిల్లా ఫుట్‌బాల్‌ జట్టు గోల్‌ కీపర్‌గా ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటింది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటడంతో పాఠశాల యాజమాన్యం మేఘనాథ్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ రాఘవేంద్ర ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది క్రీడాకారిణి చేతనశ్రీ.


ఫుట్‌బాల్‌.. ఆణిముత్యాలు

గోల్స్‌ సాధిస్తూ విద్యార్థుల రాణింపు

కృషి, పట్టుదల, ఏకాగ్రతతో సాధన చేస్తే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని నిరూపించారు క్రీడాకారులు. ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకుని మైదానంలో నిత్యం సాధన చేస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణలో మెలకువలు నేర్చుకుంటూ. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.  

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


జాతీయ పోటీల్లో రాణించేందుకు సాధన  

ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి రామ్మోహన్‌, పదో తరగతి చదువుతున్నాడు. ఫుట్‌బాల్‌లో గతేడాది కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఒక గోల్‌ సాధించి ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. కర్నూలు, కడప, నెల్లూరు జట్ట మధ్య జరిగిన పోటీల్లో ప్రతిభ చాటారు. జాతీయ పోటీల్లో రాణించే లక్ష్యంతో నిత్యం నాలుగు గంటలపాటు మైదానంలో సాధన చేస్తున్నాడు. ప్రసుత్తం అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.


ఫుట్‌బాల్‌ ఫార్వర్డ్‌లో సత్తా చాటుతూ...

ఈ చిత్రంలో తండ్రితో కనిపిస్తున్న విద్యార్థి సంజయ్‌దర్శన్‌. ఎమ్మిగనూరులోని కస్తూర్బాలో 8వ తరగతి చదువుతున్నాడు. ఫుట్‌బాల్‌పై మక్కువతో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో గంటపాటు సాధన చేస్తున్నాడు. ఇటీవల కర్నూలు జిల్లా ఫుట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యాడు. చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ఆడారు. ఫార్వర్డ్‌లో రాణిస్తూ ఉత్తమ క్రీడాకారుడిగా ప్రతిభా పురస్కారం అందుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని