logo

శ్రీనిధి.. బినామీల పెన్నిధి

మద్దికెర వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం కార్యాలయం నుంచి పొదుపు సంఘాల సభ్యులకు అందాల్సిన శ్రీనిధి సొమ్మును సిబ్బందే బినామీ పేర్లతో కాజేస్తున్నారు.

Published : 22 Sep 2023 02:47 IST

రూ.30 లక్షల వరకు గోల్‌మాల్‌ 
మద్దికెరలో సిబ్బంది చేతివాటం

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం కార్యాలయం నుంచి పొదుపు సంఘాల సభ్యులకు అందాల్సిన శ్రీనిధి సొమ్మును సిబ్బందే బినామీ పేర్లతో కాజేస్తున్నారు. తిరిగి చెల్లించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పొదుపు సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా ఒక రూపాయి వడ్డీతో రుణం మంజూరు చేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మండలానికి రూ.2.40 కోట్లు, 2023-24 ఏడాదికి రూ.4.39 కోట్లు విడుదలయ్యాయి. సంఘం సభ్యుల ఆమోదంతో ఈ నిధిని సభ్యురాలికి వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం అధికారులు మంజూరు చేస్తారు. సొమ్మును తీసుకున్న సభ్యులు ప్రతి నెలా కొంత మేర చెల్లించడంతో పాటు, ఆ మొత్తానికి రూపాయి చొప్పున వడ్డీ జతచేసి తిరిగి చెల్లించాలి. శ్రీనిధి రుణాల చెల్లింపులో కొందరు సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులకు కొంత మామూళ్లు ముట్టజెప్పి బినామీ పేర్లతో నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

రూ.30 లక్షలు ఎవరి చేతిలో

మద్దికెర మండలంలో 11 గ్రామాల పరిధిలో 863 పొదుపు సంఘాలున్నాయి. వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సంఘం సభ్యులకు తెలియకుండానే శ్రీనిధి నుంచి బినామీ పేర్లతో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. వీరిలో మద్దికెర, యడవలి, బసినేపల్లి, బురుజుల తదితర గ్రామాలకు చెందిన వారు అత్యధికంగా ఉన్నారు. రూ.30 లక్షల మేర రుణ బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంతకు రెట్టింపు ఉంటుందని సమాచారం. తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రతి నెలా అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంది.

మామూళ్లు ఇవ్వాల్సిందే

శ్రీనిధి నుంచి రుణాలు మంజూరు చేసేందుకూ అధికారులు, సిబ్బంది చేయి తడపాల్సిందే. రుణం పొందే సభ్యురాలు రూ.300 నుంచి రూ.500 ఇచ్చుకోవాల్సిందే. నిత్యం ఏదో సంఘం వారు రుణాలు పొందుతూనే ఉంటారు. వారంతా అధికారులు, సిబ్బందికి ఎంతో కొంత ఇవ్వాల్సిందే. కొందరు అధికారుల తమ ఇంటి అద్దెలు కింది స్థాయి సిబ్బందే చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ‘‘ వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ద్వారా శ్రీనిధి నుంచి 2019- 20 ఆర్థిక సంవత్సరంలో రూ.2.40 కోట్లు మంజూరు చేశారు. కాల పరిమితికి సంబంధించి దస్త్రాల్లో రూ.7.30 లక్షల బకాయిలు ఉన్నాయి. పూర్తిగా పరిశీలించి రికవరీ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ఈ రుణాల మంజూరులో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని’’ మద్దికెర ఏపీఎం మధుబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని