logo

24న వందేభారత్‌ వచ్చేస్తోంది

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 24 నుంచి కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) మార్గంలో పరుగులు పెట్టనుంది.

Updated : 22 Sep 2023 05:48 IST

కర్నూలు, డోన్‌ మీదుగా యశ్వంత్‌పూర్‌కు

ట్రయల్‌ రన్‌లో భాగంగా కాచిగూడ నుంచి డోన్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 24 నుంచి కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) మార్గంలో పరుగులు పెట్టనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఒకేసారి తొమ్మిది రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి 2 గంటలకు మహబూబ్‌నగర్‌, 4.15 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 4.17 గంటలకు బయలు దేరి డోన్‌ మీదుగా వెళ్లనుంది. ఈ రైలు రెండు ఐటీ నగరాలు హైదరాబాద్‌, బెంగళూరుల మధ్య వెళ్లనుండటంతో ఆదరణ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. - న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం

8 గంటల్లో చేరుకోవచ్చు

వందేభారత్‌ రైలు గరిష్ఠ వేగం 160 కి.మీ కాగా, ఆ వేగాన్ని రైల్వే ట్రాక్‌లు తట్టుకునే సామర్థ్యం లేవనే ఉద్దేశంతో 130 కి.మీ.లకు పరిమితం చేసినట్లు సమాచారం. కానీ కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ మధ్య సగటున 72.55 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించనుంది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు 618 కి.మీ.లు దూరం ఉంది. ఈ రైలు ఏడు నుంచి 8 గంటల్లో చేరుకోనుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైలు కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే 11 నుంచి 12 గంటల పాటు సమయం పడుతుండగా, ఈ రైలు వల్ల నాలుగైదు గంటలు తగ్గుతుంది.

మరిన్ని వివరాలు...

  •  కర్నూలు నుంచి కాచిగూడకు 236 కి.మీ.లు, కర్నూలు నుంచి యశ్వంత్‌పూర్‌కు 375కి.మీ.లు ఉంటుంది.
  •  ఏసీ ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లకు (కాచిగూడ నుంచి యశ్వంత్‌పుర్‌కు) రూ.2,425లు, ఏసీ చైర్‌కార్‌లో రూ.1,545లు ఛార్జిని వసూలు చేయనున్నట్లు సమాచారం. వాటికి అదనంగా కేటరింగ్‌ ఛార్జీలు రూ.299 లుగా చెల్లించాల్సి ఉంటుందని, ఇంకా ఇవన్నీ ఖరారు కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

మూడు సార్లు ట్రయల్‌ రన్‌

ఈ రైలు ట్రయల్‌రన్‌ ఈ ఏడాది జులై 31న చెన్నై నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగా డోన్‌ రైల్వేస్టేషన్‌కు నిర్వహించారు. అదేరోజు స్థానిక రైల్వే స్టేషన్‌లోని ఒకటో ఫ్లాట్‌పారం నుంచి ఉదయం 6.50 గంటలకు అధికారులు ట్రయల్‌ రన్‌గా పంపించారు. 9న కాచిగూడ నుంచి డోన్‌ రైల్వేస్టేషన్‌కు, తిరిగి డోన్‌ నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌కు అధికారులు రెండోసారి ట్రయల్‌రన్‌ జరిపారు. ప్రస్తుతం మూడోసారి ఈ నెల 21న కాచిగూడ నుంచి నేరుగా కర్నూలు, డోన్‌ మీదుగా యశ్వంత్‌పూర్‌కు ట్రయల్‌రన్‌ చేపట్టారు.


ఏయే వసతులుంటాయంటే...?

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు అన్నీ ఏసీవే. రెండు ఎగ్జిక్యూటీవ్‌ చైర్‌కార్‌లు, 14 చైర్‌కార్లు, 1,128 సీట్ల సామర్థ్యంతో ఉన్న దీనికి ఆటోమేటిక్‌ తలుపులు, విశాలమైన లోకోపైలెట్‌ క్యాబిన్‌ సొంతం. బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్‌ కండీషనింగ్‌ సిస్టంతో పాటు వైఫైతో ఉన్న కవచ్‌ రైలు ప్రొటెక్షన్‌ సిస్టం, కోచ్‌లన్నింటిలో 32 ఇంచీల టెలివిజన్‌, రిక్లైనబుల్‌ సీట్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌ యూనిట్‌ ప్రత్యేకం. సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్‌ మరుగుదొడ్లు, స్మోక్‌ అలారం, ఫుట్‌రెస్ట్‌, సెన్సార్‌తో పని చేసే కుళాయిలు, హయ్యర్‌ ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ వంటి వాటిని కల్పించారు.


ఎక్కడికి.. ఎప్పుడు..

కాచిగూడ నుంచి బయల్దేరి మహబూబ్‌నగర్‌, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో వందేభారత్‌ ఆగనుంది. తర్వాత నేరుగా యశ్వంత్‌పూర్‌ వెళ్తుంది. రోజూ కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు బయల్దేరి మహబూబ్‌నగర్‌కు 7గంటలకు, కర్నూలు సిటీకి 8.40 గంటలకు, డోన్‌కు 9.30 గంటలు, అనంతపురానికి 10.55, ధర్మవరానికి 11.30 గంటలకు, యశ్వంత్‌పూర్‌ మధ్యాహ్నం 2 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్‌ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి ధర్మవరానికి సాయంత్రం 5.15కు, అనంతపురానికి 5.41, డోన్‌కు 7.15, కర్నూలు సిటీకి 7.51 గంటలకు, మహబూబ్‌నగర్‌కు రాత్రి 9.40, కాచిగూడకు రాత్రి 11.15 గంటలకు చేరుతుందంటున్నారు. రాత్రి 11.15 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.


ఎలా వెళ్తుందంటే...?

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని కాచిగూడ నుంచి షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల, కర్నూలు, గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని డోన్‌, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, నైరుతి రైల్వే బెంగళూరు డివిజన్‌లోని పెనుగొండ, హిందూపురం, వంటి రైల్వేస్టేషన్ల మీదుగా యశ్వంత్‌పూర్‌ వెళ్తుంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఆరు డివిజన్లు ఉండగా అన్ని రూట్లలో గరిష్ఠ వేగంతో రైళ్లు రాకపోకలు సాగించేందుకు లైన్లను ఆధునికీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని