logo

నెలల పిల్లాడికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.16కోట్లు అవసరం!

ఓ పిల్లాడికి అరుదైన జబ్బు సోకింది. చికిత్సకు రూ.కోట్లు ఖర్చవుతాయని వైద్యులు తేల్చారు. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే కావడం..

Updated : 22 Sep 2023 12:07 IST

చికిత్స పొందుతున్న నివాన్ష్‌

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : ఓ పిల్లాడికి అరుదైన జబ్బు సోకింది. చికిత్సకు రూ.కోట్లు ఖర్చవుతాయని వైద్యులు తేల్చారు. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే కావడం.. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కర్నూలు నగరంలోని ఎన్‌.ఆర్‌.పేటకు చెందిన వెంకటేష్‌ గౌడు, ఉషారాణి దంపతులకు వివాహమైన ఏడేళ్ల తర్వాత కుమారుడు నివాన్ష్‌ పుట్టాడు. చాలా సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడంతో ఎంతో సంతోషించారు. కొద్దిరోజులకే వారి ఆనందం ఆవిరైంది. నెలలు గడుస్తున్నా పిల్లాడు కాలు, మెడ కదపలేని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలల వయస్సులోనే అనారోగ్యానికి గురవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నగరంలోని చిన్నపిల్లల వైద్యులకు చూపించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించగా జన్యుపరమైన సమస్యతో వచ్చే జబ్బుగా వైద్యులు నిర్ధారించారు. వైద్యం అందించేందుకుగాను పిల్లాడికి రెండేళ్ల వయస్సులోపు వ్యాక్సిన్‌ వేయించేందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. పిల్లాడి తల్లిదండ్రులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అంత భారీ మొత్తం డబ్బు ఎలా సేకరించాలో అర్థంకాక వారు అల్లాడుతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో రోజురోజుకు పిల్లాడి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే తప్ప పిల్లాడికి వైద్యం అందించలేని పరిస్థితి అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు