logo

ఇటుకబట్టీల్లో మగ్గుతున్న బాల్యం

బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు, చట్టాలు అమలుచేస్తున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదనడానికి పలుచోట్ల బాలలతో పనులు చేయిస్తున్న దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిషేధ

Published : 17 Jan 2022 01:49 IST

విద్యావకాశాలకు దూరంగా వలస కార్మికుల చిన్నారులు
న్యూస్‌టుడే, మదనాపురం

మదనాపురంలో సమీపంలో ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న బాలకార్మికుడు

బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు, చట్టాలు అమలుచేస్తున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదనడానికి పలుచోట్ల బాలలతో పనులు చేయిస్తున్న దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం 1986 ప్రకారం బాలలను పనిలో పెట్టుకొని వారి శ్రమ దోపిడీచేయడం నేరం. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నా జిల్లాలోని కొందరు ఇటుకబట్టీల నిర్వాహకులు చట్టాన్ని ఉల్లంఘించి 14 ఏళ్లలోపున్న బాలలను కార్మికులుగా మార్చేస్తున్నారు. అలాగే 18 ఏళ్లలోపు వయసున్న వారూ పనులు చేస్తున్నారు. మదనాపురం మండల కేంద్రం సమీపంలోని ఇటుకబట్టీలలో బాలలు ఎక్కువగా పనిచేస్తున్నారు. మదనాపురం, దంతనూర్‌, దుప్పల్లి ప్రాంతాల్లో దాదాపు 23 ఇటుకబట్టీలు ఉండగా దాదాపు 10 బట్టీలలో 50 మంది వరకు బాలలు పనిచేస్తున్నారు. వీరిలో 14 ఏళ్లలోపు బాలలు 20 మంది ఉండగా, 18 ఏళ్లలోపున్న వారు 30 వరకు ఉన్నారు. జోగులాంబ గద్వాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను బట్టీల యాజమాన్యాలు పనుల్లోకి తీసుకుంటున్నారు. కార్మికులతో పాటు వారి పిల్లలతో కూడ పనులు చేయించి శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు.


కౌన్సెలింగ్‌ చేస్తాం..
బట్టీలలో పిల్లలతో పనులు చేయిస్తున్న విషయమై జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా వెట్టిచాకిరీ నుంచి బాలలకు విముక్తి కల్పించేందుకు ఈనెల 30 వరకు ప్రత్యేకంగా ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటుకబట్టీలలో పనిచేసే బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులతో పాటు యాజమాన్యాలకు కౌన్సెలింగ్‌ చేస్తాం. బాలలను పనిలో పెట్టుకున్నవారిపై కేసులు నమోదు చేస్తాం. పనులు మాన్పించిన చిన్నారులను సమీపంలోని పాఠశాలల్లో చేర్పించడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని