logo

సీఏ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఓ కేసు విషయంలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేయగా.. ఎస్సై కొట్టడంతోనే తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తండ్రి ఆరోపించారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 17 Jan 2022 01:49 IST

ఎస్సై కొట్టారని తండ్రి ఆరోపణ

మక్తల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : ఓ కేసు విషయంలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేయగా.. ఎస్సై కొట్టడంతోనే తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తండ్రి ఆరోపించారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్‌ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లో సీఏ చదువుతున్నాడు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వీరాభిమాని అయిన ఇతను నూతన సంవత్సరం సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అదే రోజు తెరాస నాయకులు కూడా శుభాకాంక్షలు తెలుతూ కట్టిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. దీంతో తెరాస నాయకులు అజయ్‌కుమార్‌పై ఈ నెల 4న మక్తల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అనంతరం తాను చెప్పడంతోనే కేసు పెట్టారని తనపై అజయ్‌కుమార్‌పై ఈ నెల 6న వీఆర్‌ఏ చెన్నప్ప కూడా ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేయడంతో చదువులకు ఆటంకం ఏర్పడుతుందని మనస్తాపానికి గురైన అజయ్‌కుమార్‌ ఈ నెల 14న గ్రామంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. రాజకీయ నాయకుల మాటలు విని ఎస్సై తన కుమారుడిని కొట్టాడని తండ్రి రామ్మూర్తి ఆరోపించారు. ఈ విషయమై ఎస్సై ఎ.రాములును వివరణ కోరగా.. గ్రామంలో ఫ్లెక్సీలు చించారని వీఆర్‌ఏ చెన్నప్ప, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదును విచారించి అయిదుగురిపై కేసు నమోదు చేశామని, తాము ఎవరినీ ఠాణాలో కొట్టలేదని అన్నారు. ఫిర్యాదులు 4, 6వ తేదీల్లో అందితే.. ఆత్యాహత్యా యత్నం చేసింది 14వ తేదీ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు