logo

క్రైమ్‌ వార్తలు

అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి గ్రామీణ ఠాణా ఎస్సై చంద్రమోహన్‌రావు కథనం ప్రకారం.. వనపర్తి మండల

Published : 17 Jan 2022 01:48 IST

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి గ్రామీణ ఠాణా ఎస్సై చంద్రమోహన్‌రావు కథనం ప్రకారం.. వనపర్తి మండల పరిధిలోని రాజపేట పెద్దతండా గ్రామ శివారు బనిగానితండాకు చెందిన కుర్మానాయక్‌(24) అలియాస్‌ కుమార్‌, అంజలి దంపతులు హైదరాబాద్‌లోని కూకట్పల్లి(దేవేంద్రనగర్‌)లో నివాసముండేవారు. కుర్మానాయక్‌ ఆటో నడుపుతూ జీవనాన్ని సాగించేవారు. వనపర్తిలో బ్యాంకు ఖాతా  తీసుకోవాలని ఈ నెల 12న ఆయన తండాకు వచ్చారు. 13న కుర్మానాయక్‌ భార్య అంజలితో చరవాణిలో మాట్లాడుతూ.. ఇదే తండాకు చెందిన హరీశ్‌నాయక్‌ డబ్బులిస్తాడని తీసుకుని వస్తానని చెప్పాడు. ఆ తర్వాత కుర్మానాయక్‌కు ఆయన భార్య, కుటుంబసభ్యులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. తండాకు చెందిన విజయ్‌, దేవుల రాజపేట శివారులో ఉన్న కృష్ణసముద్రం చెరువు సమీపంలోని పొలం వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి అక్కడ దుస్తులు కనిపించాయి. ఈ విషయాన్ని కుర్మానాయక్‌ కుటుంబసభ్యులకు వారు తెలియజేశారు. అక్కడి చేరుకున్న సురేష్‌, విజయ్‌ చెరువులో తేలి ఉన్న కుర్మానాయక్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అంజలి తన భర్త మృతికి తండాకు చెందిన హరీశ్‌, మరో వ్యక్తి కారణమై ఉండవచ్చని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.  


పెద్దమందడి మండల పరిధిలో మరొకరు..  

పెద్దమందడి, న్యూస్‌టుడే : వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై బాలకిష్టయ్య  కథనం ప్రకారం.. వీరాయపల్లికి చెందిన కురుమయ్య (56) శనివారం రాత్రి 8 గంటలకు పొలం దగ్గరికి వెళ్లారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని వరి నారుమడిలో తలభాగం పూర్తిగా కూరుకుపోయి మృతి చెంది ఉన్నారు. శనివారం పండగ రోజు అందరితో సంతోషంగా గడిపిన కురుమయ్య మృతి చెందడంపై  కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై గాయాలు ఉన్నాయని కురుమయ్య భార్య దాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్సై చెప్పారు.


అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

రాజాపూర్‌, న్యూస్‌టుడే : అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మితే.. కొన్న వారు డబ్బులు ఇవ్వడం లేదని సూసైడ్‌ నోట్‌ రాసి రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలంలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హైదరాబాదులోని ఎల్బీనగర్‌ పరిధి చింతలకుంటకు చెందిన సురేందర్‌ (55) అప్పులపాలయ్యారు. వాటిని తీర్చేందుకు ఓ ఎక్సైజ్‌ ఎస్సైకి ఇల్లు విక్రయించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయినా పూర్తిగా ఆయన డబ్బులివ్వలేదు. ఈ నేపథ్యంలో అప్పులిచ్చిన వారు డబ్బులు అడుగుతుండడంతో సురేందర్‌ మానసికంగా ఆందోళనకు గురయ్యారు. ‘అప్పులు తీర్చలేని స్థితిలో ఏమీ చేయలేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నా. నా చావుకు కారణం ఇల్లు కొన్న వ్యక్తే. నా భార్య అమాయకురాలు. నేను చనిపోయాక ఇల్లు కొన్న వ్యక్తి డబ్బులిస్తే.. ఆమెకు రూ.5 లక్షలు ఇవ్వండి. ప్రస్తుతం నా వద్ద ఉన్న డబ్బులను అప్పులోళ్లకు ఇవ్వాలి’.. అని సూసైడ్‌ నోట్‌ రాసి జేబులో పెట్టుకొని రాజాపూర్‌ రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడ్డారు. మృతదేహాన్ని జడ్చర్ల కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని