logo

మంత్రుల వద్ద కూల్చివేత పంచాయితీ?

అయిజ పురపాలికలో చేపట్టిన అనుమతిలేని కట్టడాల కూల్చివేత వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారగా పంచాయతీ ఇద్దరి మంత్రుల ముందుకు చేరినట్లు సమాచారం.

Published : 17 Jan 2022 01:48 IST

అయిజలో పొక్లెయిన్‌తో కూలుస్తున్న దృశ్యం(పాత)

న్యూస్‌టుడే, అయిజ: అయిజ పురపాలికలో చేపట్టిన అనుమతిలేని కట్టడాల కూల్చివేత వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారగా పంచాయతీ ఇద్దరి మంత్రుల ముందుకు చేరినట్లు సమాచారం. వ్యవహారంలో మంత్రులు జోక్యం చేసుకోవడంతో స్థానిక అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులకు తలనొప్పిగా మారినట్లు తెలిసింది.

జిల్లాలో గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్‌ పురపాలికల్లో కలిపి అధికారులు 82 అనుమతిలేని కట్టడాలను గుర్తించారు. వాస్తవానికి అనుమతిలేనివి రెట్టింపు ఉంటాయని అంచనా. డిసెంబరు 15న అయిజలో కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. 31 కట్టడాలు అనుమతి లేనివిగా గుర్తించగా 20 నిర్మాణాలను కూల్చేశారు. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా కూల్చవచ్చు అనే నిబంధన ఉన్నప్పటికీ కనీసం కూల్చేసే సమయంలో సమాచారం ఇవ్వకుండా ఎందుకు కూల్చేశారని పాలకవర్గంతోపాటు అధికార పార్టీ నాయకులు అధికారులను ప్రశ్నించారు. పట్టణంలోని నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల వారివి మాత్రమే కూల్చారని పెట్రోల్‌బంక్‌ చౌరస్తాలో నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని ఎందుకు కూల్చలేదని ప్రస్తుతం మంత్రుల వద్ద పంచాయితీ పెట్టినట్లు పట్టణంలో చర్చ నడుస్తోంది.

అక్రమార్కులకు గుణపాఠంగా మారేనా..? :  అనుమతి లేకుండా నిర్మించుకుంటున్న వారికి కూల్చివేత వ్యవహారం గుణపాఠంగా మారనుందని ప్రజలు భావిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు మొదలు పెట్టడం, ఆ తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇక్కడ పంచాయతీగా ఉన్నప్పటి నుంచే అలవాటయిందని వారు పేర్కొంటున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే అనుమతి తీసుకొన్న తర్వాత నిర్మాణాలు ప్రారంభిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..


నిబంధనల ప్రకారం చర్యలు
- నర్సయ్య, పుర కమిషనర్‌, అయిజ

70 గజాలలోపు నిర్మించేవారు కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. కూల్చివేత అనంతరం మిగిలినవారు కూడా దరఖాస్తు చేసుకొన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలను గుర్తించాం. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని