logo

సరిహద్దుల్లో అప్రమత్తం

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ప్రజలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతోపాఉట జాతీయరహదారి, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణాల వద్ద వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ఒక్కో షిఫ్టుకు వైద్యుడు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త విధుల్లో ఉండి వచ్చిన ప్రజలకు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.

Published : 17 Jan 2022 01:48 IST

సిబ్బందికి సౌకర్యాలు కరవు
న్యూస్‌టుడే, ఉండవల్లి, మానవపాడు

పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కొవిడ్‌ పరీక్ష నిర్వహిస్తున్న ఆశా కార్యకర్త

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ప్రజలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతోపాఉట జాతీయరహదారి, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణాల వద్ద వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ఒక్కో షిఫ్టుకు వైద్యుడు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త విధుల్లో ఉండి వచ్చిన ప్రజలకు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.

జిల్లాలో ఇక్కడ
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన పుల్లూరు టోల్‌ప్లాజా, నందిన్నె, బల్గెర, అలంపూర్‌, గద్వాల రైల్వేస్టేషన్లు, గద్వాల బస్సు ప్రయాణ ప్రాంగణాల్లో వైద్యసిబ్బంది ప్రజలకు పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు హోంఐసోలేషన్‌లో ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి మెడికల్‌కిట్‌ అందజేస్తున్నారు.

టోల్‌ప్లాజా వద్ద వ్యర్థాలను డబ్బాలో పడేసిన దృశ్యం

నామమాత్రంగా పరీక్షలు
ప్రయాణ ప్రాంగణాలు వంటి ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు కొంతమేర ఇబ్బంది లేకపోయినా.. జాతీయ రహదారిగుండా వచ్చే ప్రజలకు, రాష్ట్ర సరిహద్దుల వద్ద వైద్యసిబ్బందికి అది అసాధ్యం. దీంతో కొవిడ్‌ పరీక్షలు నామమాత్రంగా కొనసాగుతాయనడంలో సందేహం లేదు. గతంలో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద వైద్యసిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించారు. పోలీసులు రహదారి గుండా వచ్చే వాహనాలను ఆపితే రెవెన్యూశాఖ అధికారులు వివరాలు నమోదు చేసుకుని వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించారు. దీంతో పనులు సజావుగా కొనసాగేవి. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొవిడ్‌ పరీక్షలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్‌ పరీక్ష కేంద్రంలో అయిదు రోజులకు కేవలం 183 మందికే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

వసతులేవీ..
జిల్లాలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు కొవిడ్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే వైద్యసిబ్బందికి పూర్తి స్థాయిలో వసతులు కరవయ్యాయి. తాగునీటి సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంది. కొవిడ్‌ పరీక్షలు చేసిన వ్యర్థాలను వేసేందుకు చెత్తబుట్టలు లేకపోవడంతో చిన్న అట్ట డబ్బాల్లో వేస్తున్నారు. మహిళా సిబ్బందికి తగిన సౌకర్యాలు లేవు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
- డా.చందూనాయక్‌, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో

జిల్లాలో ఏరియాఆసుపత్రి, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలతోపాటు ఎంపిక చేసిన ఏడు ప్రాంతాల్లో నిత్యం 2,500లకుపైగా కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నాం. రోజుకు 15 వరకు పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. అవి కూడా సరిహద్దు ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్సు ప్రయాణ ప్రాంగణాల వద్ద నమోదవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో వైద్యసిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసుశాఖ ఉద్యోగులు ఉంటే పరీక్షల నిర్వహణ సులువుగా ఉంటుందని కలెక్టర్‌, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లా. వసతులు కల్పించడానికి కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని