logo

ఉపాధి కల్పన.. అరకొరే!

ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రస్తుతం అలంకార ప్రాయాలుగా మారాయి. గతంలో ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో తమ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను నమోదు చేసుకుంటే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదనే భరోసా ఉండేది.. కానీ ప్రస్తుతం కేవలం నిరుద్యోగ అభ్యర్థుల నమోదుకే పరిమితమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్‌, రికార్డు అసిస్టెంట్‌, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలని అప్పటి ప్రభుత్వాలు బాధ్యతలను అప్పగించేవి..

Published : 17 Jan 2022 01:48 IST

నిరుద్యోగుల నమోదుకే పరిమితమవుతున్న కార్యాలయాలు
న్యూస్‌టుడే, పాలమూరు

పాధి కల్పన కార్యాలయాలు ప్రస్తుతం అలంకార ప్రాయాలుగా మారాయి. గతంలో ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో తమ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను నమోదు చేసుకుంటే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదనే భరోసా ఉండేది.. కానీ ప్రస్తుతం కేవలం నిరుద్యోగ అభ్యర్థుల నమోదుకే పరిమితమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్‌, రికార్డు అసిస్టెంట్‌, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలని అప్పటి ప్రభుత్వాలు బాధ్యతలను అప్పగించేవి.. కానీ నేడు ఆ పరిస్థితి లేక అరకొరగా ఉద్యోగ మేళాలను నిర్వహించి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలను కల్పిస్తున్నారు.. అయిదు జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల్లో 74,592 మంది నిరుద్యోగులు నమోదై ఉండగా.. రెండేళ్లలో 932 మందికి మాత్రమే ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు చూపించడం గమనార్హం.

మూడు జిల్లాల్లోనే..

ఏడాది పొడవునా ఉపాధి కల్పన కార్యాలయ అధికారులు అరకొరగా ఉద్యోగ మేళాలను నిర్వహించారు. మూడు జిల్లాల్లో అప్పుడప్పుడు వీటిని నిర్వహించగా, మిగతా రెండు జిల్లాల్లో వీటిని నిర్వహించలేదు.
* మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2020లో పదిసార్లు ఉద్యోగ మేళాలను నిర్వహించి 209 మందికి ప్రైవేటు సంస్థల్లో ఉపాధిని కల్పించారు. 2021లో పది సార్లు మేళాలను నిర్వహించగా కేవలం 60 మందికి మాత్రమే ఉపాధిని కల్పించారు.
నాగర్‌కర్నూల్‌లో 2020లో పదిసార్లు ఉద్యోగ మేళాను నిర్వహించి అందులో 119 మందికి ఉపాధి కల్పించగా, 2021లో ఏడుసార్లు ఉద్యోగ మేళాలను నిర్వహించి 42 మందికి ఉపాధిని కల్పించారు.
జోగులాంబ గద్వాలలో 2020లో ఆరుసార్లు మేళాను నిర్వహించి 22 మందికి, 2021లో 8 సార్లు మేళాను నిర్వహించి 392 మందికి ఉపాధిని కల్పించారు.
వనపర్తిలో 2021లో కేవలం రెండుసార్లు మాత్రమే ఉద్యోగ మేళాను నిర్వహించి అతి తక్కువగా 88 మందికి మాత్రమే ఉపాధిని కల్పించారు.
* నారాయణపేట జిల్లాలో ఉద్యోగ మేళాల ఊసే లేకుండా పోయింది. ఈ జిల్లాలో ఒక్కసారి కూడా ఉద్యోగ మేళాను నిర్వహించకపోవడం విశేషం.


చర్యలు తీసుకుంటున్నాం
ఉద్యోగ మేళాలను నిర్వహించి అందులో అర్హత కలిగిన వారికి వివిధ కార్పొరేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్‌నగర్‌ జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్‌సింగ్‌ చెప్పారు. రెండేళ్ల నుంచి కొవిడ్‌ కారణంగా సక్రమంగా ఉద్యోగ మేళాలను నిర్వహించలేదన్నారు. ఈసారి మాత్రం ఎక్కువ మేళాలను నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు