logo

రేషన్‌ అక్రమ దందా

జనవరి 13న కొంత మంది మిల్లర్లు మూడు లారీల్లో వడ్లను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ధరూర్‌ మండలం పార్చర్ల మిట్ట వద్దకు వారు వెళ్లేలోపే రెండు లారీలు మాయం అయ్యాయి. దొరికిన ఒక లారీని రేవులపల్లి పోలీసుస్టేషన్‌కు

Published : 17 Jan 2022 01:48 IST

రంగు పరీక్షతో చెక్‌పడే అవకాశం

న్యూస్‌టుడే, గద్వాల పట్టణం

సీఎంఆర్‌ వడ్లు అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో గురువారం ధరూర్‌లో పట్టుకుని వదిలి పెట్టిన లారీ

జనవరి 13న కొంత మంది మిల్లర్లు మూడు లారీల్లో వడ్లను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ధరూర్‌ మండలం పార్చర్ల మిట్ట వద్దకు వారు వెళ్లేలోపే రెండు లారీలు మాయం అయ్యాయి. దొరికిన ఒక లారీని రేవులపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇందులో దాదాపు 420(72కేజీలు) బస్తాల ధాన్యం ఉన్నట్లు సమచారం. కొన్ని పత్రాలను పోలీసులకు చూయించి అక్కడి నుంచి లారీని తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.


2021 అక్టోబర్‌ 19న జిల్లా కేంద్రంలోని ఓ మిల్లు నుంచి రెండు లారీల్లో(40కేజీలు) 1,350 బస్తాల్లో సీఎంఆర్‌ వడ్లను లోడ్‌ చేస్తుండగా జిల్లా పౌరసరఫరాల అధికారిణి రేవతి తన సిబ్బందితో పట్టుకుంది. అదే రోజు ఒక లారీలో(40 కేజీలు) 650 బస్తాల సీఎంఆర్‌ వడ్లను లోడ్‌ చేసుకుని వెళ్తుండగా మల్దకల్‌ మండలం బూడిదపాడు వద్ద అధికారులు పట్టుకున్నారు. వరి ధాన్యంతో పాటు మూడు లారీలను తీసుకొచ్చి దాదాపు 40 రోజులు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఉంచి భారీ ఎత్తున జరిమానా విధించి వదిలి పెట్టారు. వరి ధాన్యం తరలింపునకు సంబంధించి కేసు కొనసాగుతుంది.

జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రీసైక్లింగ్‌ నడుస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ధాన్యం తీసుకుని దానికి అనుగుణంగా ఎఫ్‌సీఐకి బియ్యం పంపించాలి. రీసైక్లింగ్‌ చేస్తూ కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్నే నేరుగా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక రేషన్‌ బియ్యం దందాకు త్వరలో తెరపడనుంది. భాతర ఆహార సంస్థకు బియ్యం అప్పగించే ముందు కచ్చితంగా రంగు పరీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన సీఎంఆర్‌ వడ్లను రైసు మిల్లులకు సరఫరా చేస్తుంది. మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకొన్న వడ్లను మర ఆడించకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సన్న రకం వడ్లను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాయచూరు నుంచి నూకలను తీసుకొచ్చి కొద్దిపాటి మర ఆడించిన బియ్యంలో కలిపి లెక్కలు చూయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బియ్యం అప్పజెప్పడంలో జాప్యం
గత ఖరీఫ్‌లో ముట్టజెప్పాల్సిన బియ్యాన్ని చాలా మిల్లర్లు ఇప్పటి ప్రభుత్వానికి అప్పగించలేదు. యాసంగిలో కూడా 40 శాతం కూడా బియ్యం ఇవ్వని మిల్లులు చాలా ఉన్నాయి. అయినా అధికారులు మిల్లర్లపై ఉదాసీనత చూపిస్తున్నారు.

ఇలా..  నిర్ధారణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిల్వలు ఉంచుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ఏటా బియ్యం సేకరిస్తోంది. ఎఫ్‌సీఐ మూడేళ్లపాటు వీటిని నిల్వ చేస్తుంది. ఇదే అదునుగా భావించి కేంద్ర ప్రభుత్వం బియ్యానికి రంగు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. పరీక్షనాళికలో తీసుకుని రసాయనాలు కలిపితే ఎన్ని నెలల క్రితం మిల్లింగ్‌ చేశారో తెలుస్తోంది. ఆరు నెలలు, ఏడాది క్రితం మిల్లింగ్‌ చేసినట్లు తేలితే వాటిని తీసుకోకుండా అధికారులు తిరస్కరిస్తారు.


అందుబాటులోకి పరిజ్ఞానం
- సుబ్బన్న, టెక్నికల్‌ అధికారి, గద్వాల

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకనుగుణంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బియ్యం ఎప్పుడు మర ఆడించారనే విషయాన్ని ఈ పరికరం ద్వారా కనుక్కోవచ్చు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని