logo

పునాదులు దాటని వంతెనలు

వరద వస్తే చాలు.. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. వరదల ప్రవాహం తగ్గేంత వరకు బిక్కుబిక్కు మంటు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గ్రామాల్లోనే ఉండాల్సిన దుర్భర పరిస్థితిలో గ్రామస్థులు మగ్గుతున్నారు. వర్షాకాలం అత్యవసర వైద్యానికి

Published : 17 Jan 2022 01:48 IST

వరద వస్తే రాకపోకలకు అంతరాయం

నిధుల కొరత, అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిన పనులు
- న్యూస్‌టుడే, కల్వకుర్తి

కొల్లాపూర్‌ మారెడుమాను దిన్నె వాగుపై  అసంపూర్తి వంతెన..

వరద వస్తే చాలు.. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. వరదల ప్రవాహం తగ్గేంత వరకు బిక్కుబిక్కు మంటు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గ్రామాల్లోనే ఉండాల్సిన దుర్భర పరిస్థితిలో గ్రామస్థులు మగ్గుతున్నారు. వర్షాకాలం అత్యవసర వైద్యానికి అవస్థలు పడాల్సిందే. పురుడు నొప్పులొచ్చినా కాలు బయటి పెట్టలేని దుస్థితి. జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఆరేళ్లుగా వాగులపై వంతెనలు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. కల్వకుర్తి మండల సమీపంలో రఘుపతిపేట గ్రామానికి అనుసరించుకొని ఉన్న దుంధుబీ వాగుపై వంతెన లేక ఏటా వర్షాలకు వచ్చే వరదలతో రాకపోకలు నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  

కల్వకుర్తి మండలం రఘుపతిపేట సమీపంలోని దుంధుబీ వాగుపై శిథిలమైన కాజ్‌ వే..

మారేడుమాన్‌డిన్నె - నాల్లాపూర్‌ వాగుపై వంతెన ఏర్పాటుకు ఆరేళ్ల కిందట పనులకు శ్రీకారం చుట్టారు. వంతెన ఏర్పాటుతో అటవీ ప్రాంతంలోని వృక్ష సంపదకు, జంతువులకు రక్షణ ఉండదని అటవీశాఖాధికారులు పనులను అడ్డుకున్నారు. మరో వైపు పనులు ఆగటంతో నిధులు దారి మల్లాయి. పనులు చేపట్టాలని గుత్తేదారుకు అధికారులు శ్రీముఖాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. వరద వస్తే చాలు వాగు ఉద్రిక్తతకు ముక్కిడిగుండం, మొలచింతల పల్లి, సమీపంలోని మరో ఆరు గిరిజన గ్రామాల ప్రజలు కొల్లాపూర్‌కు రాకపోకలు సాగించలేని పరిస్థితి. వర్షాకాలంలోని నాలుగు నెలలపాటు అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే బీరం హార్షవర్థన్‌రెడ్డి రూ. కోటితో వంతెన పనులకు శ్రీకారం చుట్టారు.

 పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలోని ఉడుములవాగు- నార్లాపూర్‌ పెద్ద వాగు అయిదేళ్ల కిందట దాదాపు రూ.3 కోట్లతో వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో గుత్తేదారు పనులను మధ్యలోనే వదిలేశారు. అప్పటి నుంచి వంతెన పనులు ముందుకు కదలడం లేదు. వంతెన పూర్తయితే అచ్చంపేట, లింగాల నుంచి కొల్లాపూర్‌కు వెళ్లేందుకు దూరం తగ్గనుంది. అంచనాలు పెరగటంతో ప్రత్యేకంగా నిధి కింద రూ.5.7 కోట్లతో వంతెన పనులు మొదలు పెట్టారు. పనుల్లో మాత్రం వేగం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.40 కోట్ల అంచనాలు..
రఘుపతిపేట గ్రామ సమీపంలో దుంధుబీ వాగుపై ఉన్న సిమెంటు కాజువే పూర్తి దెబ్బతింది. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సూచన మేరకు వాగుపై వంతెన ఏర్పాటుకు రూ.40 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక ఆర్‌అండ్‌బి శాఖ పంపారు. తెల్కపల్లి, లింగాల, ఉప్పునుంతల మండలాల ప్రజలకు హైదరాబాద్‌కు వెల్లటానికి ఈ దారి నుంచి దాదాపు 30 కిలోమీట్ల దూరం తగ్గనుందని ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. వరద నీటికి కేఎల్‌ఐ కృష్ణాజలాలు పారటంతో వరద ఉద్రిక్తంగా ప్రవహిస్తే ఆర్టీసీ బస్సులు సైతం బందు పెడతారు. కాజువే పూర్తిగా దెబ్బతింది. రెండు చోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ఇప్పుడు నీరు ప్రవహించటంతో ఎప్పుడు ఏమి జరగనుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు.


ప్రమాదకరంగా మారింది..
- శ్రీపతి రఘుపతిపేట గ్రామం కల్వకుర్తి.

దుంధుభీ వాగు పై ఉన్న కాజ్‌ వే  పూర్తిగా శిథిలమైంది. మరో వైపు చీకటి వాగు నుంచి వచ్చే వరద వద్ద పెద్ద  గుంతలు ఏర్పడ్డాయి. అక్కడే కాజువే పాడైయింది. వాగు అరకిలో మీటరు దూరం ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల వారు వరద వచ్చే సమయంలో కాలినడకన పోలేమా ధైర్యంతో వస్తు మార్గమద్యలోకి వచ్చాక వరద అధికమై ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెన నిర్మిస్తె ఎంతో మేలు జరగనుంది.


వర్షాకాలం వచ్చే లోపు పనులు పూర్తి..
- దామోదర్‌రావు పంచాయతీరాజ్‌, రమేశ్‌ ర.భ శాఖల ఈఈలు నాగర్‌కర్నూల్‌.

కొల్లాపూర్‌ ప్రాంతంలో మారేడుమాన్‌దిమ్మె, ఉడుముల వాగుపై జరుగుతున్న వంతెనల పనుల్లో వేగవంతం చేస్తాం. నిధుల కొరత, ఇతర కారాణాల చేత పనులు జరగకుండా ఆలస్యం కావటం వాస్తవమే. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వర్షా కాలం వచ్చే లోపు పనులు ముగించటానికి గుత్తేదారుల పై ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయిస్తాం. దుంధుబీ వాగు పై వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం.


అత్యవసరం వేళ అగమ్యగోచరం
- గంగం మల్లేశ్‌యాదవ్‌ ముక్కిడిగుండం, కొల్లాపూర్‌

వాగుల పై వంతెనల పనులు ఆగిపోవటంతో వర్షాకాలంలో ఎప్పుడు ఏమి జరగనుందోనని భయంగా ఉంది.  వరద వచ్చిందంటే కొల్లాపూర్‌కు రాకపోకలు నిలిచిపోతాయి. పక్క నున్న ఇతర గ్రామాలకు సంబంధాలే తెగిపోతాయి. ఈ పరిస్థితుల్లో జ్వరాలు వచ్చినా, పురిటి నొప్పులతో ఉన్న వారి పరిస్థితి చెప్పనక్కర లేదు. వర్షాకాలం రాకముందే వంతెన పనులు పూర్తి చేసి మా ఇబ్బందులు తొలగించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని