logo

పాఠం.. పాట్లు

విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈనెల 8 నుంచి 16 వరకు మొదట సెలవులు ప్రకటించినా.. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.

Published : 17 Jan 2022 01:48 IST

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ అర్బన్‌

డోకూరులో ఆన్‌లైన్‌ తరగతి వింటున్న విద్యార్థిని

విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈనెల 8 నుంచి 16 వరకు మొదట సెలవులు ప్రకటించినా.. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ 14 రోజులపాటు ఆన్‌లైన్‌ పాఠాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సెలవుల పొడిగింపుపై పెదవి విరిస్తున్నాయి.

కొవిడ్‌ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగానే సెలువులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో సెలువులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒమిక్రాన్‌ భయపెడుతుండడతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ పాఠాలవైపే మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ద్వారా పాఠాలు బోధించకుండా.. పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని తరగతుల విద్యార్థుల వారికి టీశాట్, దూరదర్శన్‌, యాదగిరి ఛానళ్ల ద్వారా వీడియో పాఠాలను అందుబాటులోకి తేవాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సమస్యలు అధిగమిస్తేనే..
జిల్లాలో వ్యవసాయ కూలీలు, కార్మికులు, నిరుపేదలే ఎక్కువ. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు కొత్తమే కాకపోయినా.. చాలామందికి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు లేవు. మారుమూల పల్లెల్లో నెట్‌వర్క్‌ సమస్యలు గతంలో అధికంగానే ఎదురయ్యాయి. పాఠాలు ప్రసారమయ్యే సమయంలో విద్యుత్తు కోతలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలను పరిష్కరిస్తేనే పిల్లలకు కొంతవరకు మేలు కలగనుంది.


ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం..
- ఉషారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ తరగతుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష, డిజిటల్‌ బోధనను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. విద్యాశాఖ విధివిధానాలు ప్రకటించిన వెంటనే ప్రణాళిక సిద్ధం చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని