logo

రేషన్‌ కష్టాలు!

ప్రభుత్వం పేద ప్రజలకు చౌకధర దుకాణాల ద్వారా అందించే బియ్యం, సరకులు తీసుకునేందుకు నెలనెలా ప్రయాస పడుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులు తీసుకునేందుకు చరవాణికి వచ్చే ఓటీపీ నంబరు ఆధారంగా లేదా ఐరిస్‌ ద్వారా గుర్తింపు ప్రక్రియ

Published : 17 Jan 2022 01:48 IST

లబ్ధిదారులకు తప్పని ఓటీపీ, ఐరిస్‌ చిక్కులు
- న్యూస్‌టుడే, కొల్లాపూర్‌ గ్రామీణం

పెద్దకొత్తపల్లి చౌకధర దుకాణంలో లబ్ధిదారుడికి సరకులు ఇచ్చేందుకు ఐరిస్‌ ద్వారా గుర్తిస్తున్న దృశ్యం

ప్రభుత్వం పేద ప్రజలకు చౌకధర దుకాణాల ద్వారా అందించే బియ్యం, సరకులు తీసుకునేందుకు నెలనెలా ప్రయాస పడుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులు తీసుకునేందుకు చరవాణికి వచ్చే ఓటీపీ నంబరు ఆధారంగా లేదా ఐరిస్‌ ద్వారా గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు.  

అయితే చాలా మందికి ఓటీపీ రాకపోవడం, ఐరిస్‌ గుర్తింపు పని చేయకపోవడం జరుగుతోంది. ఫలితంగా నెలనెలా బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బియ్యం పంపిణీలో నెలనెలా చాలా వరకు లబ్ధిదారులు బియ్యం అందుకోలేక పోతున్నారు.  రేషన్‌ సరకులకు ఓటీపీ విధానం అమలు చేసిన ప్రభుత్వం ఆధార్‌కు చరవాణి నంబరు అనుసంధానం చేసేందుకు సరిగా సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. మరో వైపు ఆధార్‌కు చరవాణి అనుసంధానం కోసం లబ్ధిదారులు తపాలా కార్యాలయాలు, మీసేవ కేంద్రాల్లో బారులుదీరుతున్నారు.

అందని ఓటీపీ..
ప్రభుత్వం చౌకధరల దుకాణాల్లో 2020 డిసెంబరు నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేస్తోంది. ఇందుకు ఆధార్‌ వేలిముద్రలు వేయగానే లబ్ధిదారుడి చరవాణికి ఓటీపీ వచ్చేది. దాని ప్రకారం సరకులు ఇవ్వాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో ఐరిస్‌  ద్వారా గుర్తించి ఇవ్వాలని సూచించింది. దీంతో చాలా మంది లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో చరవాణి సౌకర్యం లేకపోవడం.. ఉన్నవారి ఆధార్‌కు చరవాణి నంబరు అనుసంధానం లేకపోవడంతో ఓటీపీ రావడం లేదు. దీంతో సగానికి పైగా లబ్ధిదారులు ఐరిస్‌  ద్వారానే రేషన్‌ సరకులు పొందుతున్నారు. అయితే ఐరీష్‌ యంత్రం ప్రతి లబ్ధిదారుడి కళ్ల వద్ద ఉంచడంతో కొవిడ్‌ మిగతా వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మరోవైపు చౌకధర దుకాణాల వద్ద మాస్కులు, శానిటైజర్‌ అందుబాటులో ఉండటం లేదు. కరోనా నివారణలో భాగంగా ఐరిస్‌ ద్వారా కాకుండా చరవాణి ఓటీపీ ద్వారానే బియ్యం తదితర సరకులు అందజేయాల్సి ఉంది.  

నెల నెలా ఇబ్బందులు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9.37 లక్షల రేషన్‌కార్డులుండగా.. వీటిలో 31.77 లక్షల లబ్ధిదారులు(యూనిట్లు) ఉన్నారు. ఈ నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 4.70 లక్షల మంది లబ్ధిదారులు సరకులు పొందారు. వీరిలో ఓటీపీ ద్వారా 2.50 లక్షల మంది తీసుకోగా.. మిగతా 2.20 లక్షల మంది ఐరిస్‌  గుర్తింపు ద్వారా తీసుకున్నారు. కాగా రెండేళ్లుగా కొవిడ్‌ వ్యాప్తి భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో చౌకధర దుకాణాల్లో రేషన్‌ సరకులు పొందేందుకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  లబ్ధిదారుల నుంచి తమకు కరోనా సోకుతుందేమోననే బెంగ డీలర్లలో ఉంటోంది. కరోనా వ్యాప్తి చెందకుండా రేషన్‌ సరకులు పొందేందుకు లబ్ధిదారుల చరవాణులకు ఓటీపీ సౌకర్యం కొంత ఊరటనిస్తుండగా.. వంద శాతం ఓటీపీ అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.


అందరికీ సరకులు అందేలా..
-  మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి, నాగర్‌కర్నూల్‌

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో లబ్ధిదారులు సరకులు పొందేందుకు ఐరిస్‌, ఓటీపీ విధానం అమలులోకి తెచ్చింది. ఆధార్‌కు చరవాణి నంబరు అనుసంధానం చేసేందుకు మీసేవ కేంద్రాలు, తపాలా కార్యాలయాలకు వెళ్లి చేయించుకోవాలి. వీలైనంత వరకు ఓటీపీ ద్వారానే రేషన్‌ సరకులు అందించే ప్రయత్నం చేస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని