logo

వారధి కష్టాలు

చిన్నపాటి వర్షం కురిసిన జిల్లాలో అక్కడక్కడ కల్వర్టులు దాటి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఓ మోస్తరు వాన కురిస్తే వంతెనల మీదుగా వరద పారుతుంది. దీంతో

Published : 18 Jan 2022 01:47 IST

వంతెనల నిర్మాణ పనులు ప్రారంభించని వైనం

న్యూస్‌టుడే, వనపర్తి

మదనాపురం - ఆత్మకూరు మధ్య పొంగిపొర్లుతున్న వాగు (పాత)

చిన్నపాటి వర్షం కురిసిన జిల్లాలో అక్కడక్కడ కల్వర్టులు దాటి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఓ మోస్తరు వాన కురిస్తే వంతెనల మీదుగా వరద పారుతుంది. దీంతో వరద ఉద్ధృతి తగ్గే వరకు వంతెనకు ఇరువైపులా ఉన్న వారు ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్నేళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్నా.. పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. జిల్లాలోని పలు మండలాల పరిధిలో వంతెనలు, కాజ్‌వేలు, కల్వర్టులు నిర్మించేందుకు నిధులు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే వానాకాలంలోగా పూర్తి చేస్తే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగయ్యేందుకు అవకాశం ఉంది.

నిధులు ఇలా..

ఖిల్లాగణపురం మండలం అప్పారెడ్డిపల్లి - ఆముదంబండతండా మధ్య వంతెన నిర్మాణానికి రూ.1.20 కోట్లు, గోపాల్‌పేట మండలం గుడ్డిమోతవాగు వంతెనకు రూ.1.28 కోట్లు, వనపర్తి మండలం చాకలిబండ వాగుపై వంతెనకు రూ.1.80 కోట్లు, వనపర్తి - పెబ్బేరు రహదారిలో వంతెనకు రూ.6.80 కోట్లు, పెబ్బేరు - యాపర్ల వంతెనకు రూ.కోటి, నాటవెల్లి - అప్పరాలకు రూ.3.90 కోట్లు, వనపర్తి - పెబ్బేరు మధ్య కల్వర్టు కోసం రూ.1.70 కోట్లు, ఇదే దారిలో కాజ్‌వే కోసం రూ.1.70 కోట్లు, వనపర్తి - కొల్లాపూర్‌ రహదారిలో కేతేపల్లి వద్ద కాజ్‌వే నిర్మాణానికి రూ.3 కోట్లు, ఖిల్లాగణపురం - కొత్తమొల్గర వద్ద వంతెనకు రూ.2 కోట్లు, వెంకటాపూర్‌ - సూగూరు రోడ్డు డ్యామ్‌ కోసం రూ.3 కోట్లు, గోపాల్‌పేట మండలం బుద్దారం గండి వద్ద వంతెన నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున చొప్పున మంత్రి నిరంజన్‌రెడ్డి గతేడాది నిధులు మంజూరు చేశారు.

ఏళ్లుగా జాప్యమే..

శ్రీరంగాపురం మండల పరిధిలోని జానంపేట - బునియాదిపురం మధ్య వంతెన నిర్మాణానికి 2007లో రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయగా.. అధికారులు పనులు ప్రారంభించి పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. దీనిపై నాణ్యత శాఖ అధికారులు నాణతపై అభ్యంతర పెట్టి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ అతిగతి లేదు. తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించినా.. వాన వచ్చినప్పుడల్లా నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వరద ఉద్ధృతి ఎక్కువైతే సూగూరు మీదుగా 11 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా జానంపేట రైతుల పొలాలు ఎక్కువగా వాగు అవతలే ఉన్నాయి. దీంతో వారు  వ్యవసాయ కూలీలను తరలించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మదనాపురం-ఆత్మకూరు మధ్య ఉన్న ఊకచెట్టు వాగు వరద ఉద్ధృతి పెరిగితే వంతెనపై నీరు పారుతూ ఏటా వానాకాలంలో ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోతాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.9.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. అధికారులు పనుల ప్రారంభానికి టెండర్లు సైతం  నిర్వహించిన పనులు ప్రారంభించలేదు. దీనికి సమీపంలోనే రైల్వే గేటు ఉండటంతో వంతెన పొడవు నిర్మాణంపై ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పెద్దమందడి మండల కేంద్రం 10 కి.మీ. దూరంలో ఉంది. రాజనగరం దాటగానే కల్వర్టులు ఉన్నాయి. చిన్న కల్వర్టులే అయినా.. వాన కురిసిందంటే చాలు వరద నీరు కల్వర్టుల మీదుగా పారుతూ రాకపోకలు పూర్తిగా స్తంభింపజేస్తోంది.

దూరాభారం తగ్గించాలి

మాది పెద్దమందడి. ప్రతి పనికి జిల్లా కేంద్రానికి పోవాల్సిందే. వైద్యం, నిత్యావసర వస్తువులు, విత్తనాలు, ఎరువులు తదితర వాటి కోసం నిత్యం వనపర్తికి పోతుంటాం.  అయితే వానాకాలం వచ్చిందంటే చాలు భయమేస్తుంది. రాజనగరం వద్ద ఉన్న కల్వర్టుల మీదుగా వరద నీరు పారుతుండటంతో 25 కి.మీ. తిరిగి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. వంతెన నిర్మించి దూరాభారం తగ్గించాలి.  

- చెన్నయ్య, పెద్దమందడి

టెండర్లు పిలిచాం

జిల్లాలో వానలు వచ్చినప్పుడు వరద నీరు పారే వంతెనల స్థానంలో కొత్తగా వంతెనలు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి వచ్చే వానాకాలం లోగా పనులు పూర్తయ్యేలా చూస్తాం.  

- దానయ్య, ర.భ.శాఖ డీఈ, వనపర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని