logo

పరిశోధనకు జిజ్ఞాస

డిగ్రీ దశలో విద్యార్థుల్లో పరిశోధనపై అభిరుచిని పెంచి వారిలో దాగిన సృజనాత్మకతను ఆవిష్కరించే దిశగా సీసీఈ (కమిషరేట్ ఆఫ్‌ కాలేజీయేట్ ఎడ్యుకేషన్‌) సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే 2016-17 విద్యాసంవత్సరం

Published : 18 Jan 2022 01:47 IST

ఉమ్మడి జిల్లా నుంచి 150 ప్రదర్శనలు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ అర్బన్‌

ఎంవీఎస్‌ కళాశాలలో అవగాహన కల్పిస్తున్న అధికారులు

డిగ్రీ దశలో విద్యార్థుల్లో పరిశోధనపై అభిరుచిని పెంచి వారిలో దాగిన సృజనాత్మకతను ఆవిష్కరించే దిశగా సీసీఈ (కమిషరేట్ ఆఫ్‌ కాలేజీయేట్ ఎడ్యుకేషన్‌) సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే 2016-17 విద్యాసంవత్సరం నుంచి ‘జిజ్ఞాస’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా నేపథ్యంలో గతేడాది అంతరాయం ఏర్పడగా.. ఈసారి ఆహ్వానం పలికింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు స్టూడెంట్‌ స్టడీ ప్రాజెక్టు (విద్యార్థి అధ్యయన ప్రకల్పన) పోటీలకు ఆహ్వానం అందడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 150 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి నివేదించారు.

* విద్యార్థి జీవితంలో డిగ్రీ అత్యంత కీలకమైంది. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు.. వేసే అడుగులు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ప్రతిభను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు దారి తీస్తాయి. సమకాలీన అంశాలు.. సమస్యలకు పరిష్కారం చూపేందుకు ‘జిజ్ఞాస’ ద్వారా కళాశాల విద్యాశాఖ ముందడుగు వేసింది. ఏటా నిర్వహించే ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్సిటీల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. ఈ ఏడాది 17 సబ్జెక్టుల్లో పోటీలకు ఆహ్వానించారు. జిల్లాలో ఆయా కళాశాలల్లో అధ్యాపకులు విద్యార్థులకు నిర్దేశిత అంశాలపై అవగాహన కల్పించారు. దాదాపు 150కి పైగా ప్రాజెక్టులను రాష్ట్రస్థాయిలో నివేదించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఎంవీఎస్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల నుంచి 21 ప్రాజెక్టులు, ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల నుంచి 15, జడ్చర్ల బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల నుంచి 15.. మొత్తం 51 ప్రాజెక్టులు, ఉమ్మడి జిల్లా పరిధిలోని వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల నుంచి కలిపి మొత్తం 150 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి నివేదించారు.

ఎంపిక విధానం..

కళాశాల స్థాయిలో ప్రాజెక్టులను 5 నిమిషాల నిడివితో దృశ్య రూపకంగా వీడియో తీసి సబ్జెక్టుల వారీగా రాష్ట్రస్థాయి పోటీలకు పంపారు. శాస్త్రవేత్తలు, ఆచార్యులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి పీపీటీ, వైవా ఆధారంగా వారి ప్రాజెక్టు ఏమేర విజయవంతం అవుతుందనే కోణంలో అంచనా వేసి ఫలితాలు ప్రకటిస్తారు. మొదటి బహుమతి రూ.30 వేలు, పర్యవేక్షకుడికి రూ.5 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.18 వేలు, పర్యవేక్షకుడికి రూ.3 వేలు, తృతీయస్థానంలో నిలిచిన వారికి ప్రోత్సాహకంగా కొంత నగదుతోపాటు ప్రశంసాపత్రం అందించనున్నారు.

దేశాభివృద్ధిలో భాగస్వామ్యం..

విద్యార్థులు పరిశోధకులు, శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికలా ఉపయోగపడుతుంది. శాస్రీˆ్తయ వైఖరులు పెంపొందుతాయి. తద్వారా దేశ అభివృద్ధిలో విద్యార్థులు, యువత భాగస్వాములుగా మారే అవకాశం దక్కుతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 150కిపైగా ప్రదర్శనలు రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలకు పంపారు. ఫలితాలు వచ్చే నెలలో రానున్నాయి.

- డా.ఎం.విజయ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌, ఎంవీఎస్‌ కళాశాల, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని