logo

ఏడాదిలోవడివడిగావ్యాక్సిన్

కరోనా వ్యాక్సినేషన్‌ చేపట్టి ఏడాది కాగా ఉమ్మడి జిల్లాలో మొదటి డోసు వందశాతం.. రెండో డోసు 70 శాతం పూర్తయింది.. 2021 జనవరి 16న ప్రారంభమైన టీకాల కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌..

Published : 18 Jan 2022 01:47 IST

మొదటి డోసు వంద శాతం పూర్తి

న్యూస్‌టుడే, పాలమూరు, అయిజ

అయిజ : విద్యార్థికి టీకా ఇస్తున్న వైద్య సిబ్బంది

కరోనా వ్యాక్సినేషన్‌ చేపట్టి ఏడాది కాగా ఉమ్మడి జిల్లాలో మొదటి డోసు వందశాతం.. రెండో డోసు 70 శాతం పూర్తయింది.. 2021 జనవరి 16న ప్రారంభమైన టీకాల కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌.. వివిధ రంగాలకు చెందినవారు.. దీర్ఘకాలిక రోగులు.. వయసుల వారీగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ నిర్వహించగా వైద్య సిబ్బంది సమష్టిగా సాగి విజయవంతం చేశారు.. ప్రస్తుతం రెండో డోసుతోపాటు బూస్టర్‌ డోసులు.. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకాల ప్రక్రియ సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత డోసుకు 26,20,891 మంది అర్హులు కాగా 26,63,893 మందికి టీకాలను వేశారు. అయిదు జిల్లాలు కూడా వందశాతం లక్ష్యాలను చేరుకున్నాయి. రెండో డోసు 18,52,345 మందికి అందించగా, 1,15,482 మంది 15- 18 ఏళ్ల లోపు కొవిడ్‌ టీకాలను తీసుకున్నారు.

* రాష్ట్ర వ్యాప్తంగా 15-18 ఏళ్ల లోపు వయస్సున్న వారికి టీకాలను అందించడంలో మహబూబ్‌నగర్‌ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వనపర్తి రెండో స్థానంలో ఉండగా, జోగులాంబ గద్వాల జిల్లా అయిదో స్థానంలో, నారాయణపేట జిల్లా 14వ స్థానంలో ఉంది.

* రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే చివరి స్థానంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 15 - 18 ఏళ్ల లోపు వయసున్న వారిలో కేవలం 29 శాతం మందికే టీకాలను అందించారు. అందువల్లనే 33వ స్థానంలో జిల్లా నిలిచింది.

ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం

గతేడాది జనవరిలో ప్రారంభించిన కొవిడ్‌ టీకాను మొదటి ప్రాధాన్యంగా ఆరోగ్య కార్యకర్తలకు అందించారు. ఆ తరవాత పోలీసులు, పురపాలిక, గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించగా, తరవాత ప్రభుత్వ ఉద్యోగులు, చౌకధరల దుకాణాలు, మార్కెట్లు, రైతు బజార్లు, హోటళ్లు, పాత్రికేయులు.. ఇతర ప్రజా సంబంధమైన కార్యకలాపాలు నిర్వర్తించే వారికి టీకాలను ఇచ్చారు. అనంతరం 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, తరవాత 45 ఏళ్లు పైబడిన వారికి కొన్ని నెలల తరువాత 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలను అందించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు టీకాలను ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.

త్వరగా పూర్తి చేస్తాం : టీకా ప్రక్రియ వందశాతం పూర్తి చేయడానికి కృషి చేయనున్నట్లు మహబూబ్‌నగర్‌ డీఎంహెచ్‌వో డా.కృష్ణ తెలిపారు. అర్హత కలిగిన వారికి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేస్తామని, అందుకోసం తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో టీకాలను అందించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని చెప్పారు. రెండో డోసు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని, విద్యార్థులకు కూడా మొదటి డోసు ఇస్తున్నామని హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోసులను అందిస్తున్నామన్నారు.

అర్హులందరికీ పంపిణీ

జిల్లాలో అర్హులైన వారందరికీ టీకా పంపిణీ చేస్తాం. మొదటి విడత నుంచి బూస్టర్‌ డోసు వరకు టీకా అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. టీకా నిల్వలు జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో టీకా కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాటి టీకాను తెప్పిస్తున్నాం.

- చందూనాయక్‌, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో

మొదటి డోసు పూర్తి అయింది : 101.60 శాతం
రెండో డోసు                     :  70.20 శాతం
15 నుంచి 18 ఏళ్ల లోపు వారు  :  62.80 శాతం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని