logo

పల్లె ప్రగతితోనే ఆదర్శ గ్రామాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితోనే పల్లెలు విరాజిల్లుతున్నందున కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ఆదర్శ గ్రామాలుగా ప్రకటించిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం

Published : 18 Jan 2022 01:47 IST

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. చిత్రంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితోనే పల్లెలు విరాజిల్లుతున్నందున కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ఆదర్శ గ్రామాలుగా ప్రకటించిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాదు ఎర్రమంజిల్‌లో ఉమ్మడి జిల్లాలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పనులపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. గ్రామ కార్యదర్శులకు జియోట్యాగింగ్‌ పెట్టామని, ఉమ్మడి జిల్లాలోని కార్యదర్శులు, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల వినియోగం కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందుకు సాగాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. కొత్త రహదారులు, మురుగు కాలువల పనులు చేసుకోవాలన్నారు. ఉపాధిహామీ నిధుల వినియోగంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పంచాయతీ భవనాలు, కాలువల పూడిక పనులూ ఉపాధి నిధులతో చేపట్టాలన్నారు. మార్చిలోగా ఎక్కువ ఉపాధి పనులు చేయాలని ఆదేశించారు.

* ఆబ్కారీ, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కోయిలసాగర్‌ నుంచి తాగునీటి సరఫరాకు కేటాయించాలన్నారు. మన్యంకొండ దేవాలయం వద్ద తాగునీటి ట్యాంకు నిర్మించామని, వృథా నీరు చెరువుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగులో ఉన్న వివిధ పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలన్నారు. ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు ప్రతిపాదిత పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

* సమీక్షలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పీవీ వాణీదేవి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాల్‌రాజు, మహేశ్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, హర్షవర్ధన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌తోపాటు పీఆర్‌ కమిషనర్‌ శరత్‌, ఈఎన్‌సీ సంజీవరావు, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎస్‌ఈలు, ఈఈలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు పాల్గొన్నారు.

* వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ కింద కాలువల పూడికతీత, కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌస్‌ నీటి సరఫరాను పునరుద్ధరించేలా చూడాలన్నారు. గ్రామీణ నీటి సరఫరాలో ఏజెన్సీల్లో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య పెంచి సమస్యలను పరిష్కరించాలన్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్ల నిర్మాణంలో దెబ్బతిన్న సీసీదారులకు మరమ్మతులు చేయాలన్నారు. లేదంటే పంచాయతీలకు ఈ బాధ్యత అప్పగించాలని సూచించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠథామాలను అనుకున్నంతగా వినియోగంలోకి రావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ దారులు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్తు సమస్య, తాగునీటి సరఫరాను ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మకంగా సీఏం ఆదేశాలతో చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో వనపర్తి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని