logo

కరోనా కాలడ్డు

గతేడాది కరోనా మహమ్మారితో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈసారి కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యక్ష తరగతులకు ఉపక్రమించింది. ఉపాధ్యాయులు సైతం ఆ సమయానికి సిలబస్‌

Published : 18 Jan 2022 01:47 IST

40 శాతమైనా పూర్తికాని పదో తరగతి సిలబస్‌

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ అర్బన్‌

గతేడాది కరోనా మహమ్మారితో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈసారి కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యక్ష తరగతులకు ఉపక్రమించింది. ఉపాధ్యాయులు సైతం ఆ సమయానికి సిలబస్‌ పూర్తి చేయడానికి యత్నించినా సాధ్యం కాలేదు. మరోసారి కొవిడ్‌, ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతుండటంతో బడులను మళ్లీ ఈ నెలాఖరు వరకు మూసేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

విద్యా సంవత్సరం కాలమానిని ప్రకారం.. 2021 సెప్టెంబరు 1న ప్రత్యక్ష తరగతుల ప్రారంభం, 10 జనవరి 2022 వరకు సిలబస్‌ పూర్తి. ప్రీ ఫైనల్‌, సాధన పరీక్షలు, ఇతరత్రా ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. వార్షిక పరీక్షలు మార్చి- ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశమున్నట్లు కాలమానిని రూపొందించారు. దాని ప్రకారం కాకుండా అదనంగా సెలవులు ఇచ్చేశారు. మధ్యలో ఆటంకాలు ఎదురవటంతో సిలబస్‌ పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాలో 40 వేలకుపైగా విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సిలబస్‌ కొంత తగ్గించారు. ఆలస్యంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడంతో ఆ మేరకు కుదించారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌, సంక్రాంతి సెలవులు అదనంగా 15 రోజులు పెంచడంతో కొంతమేర సమయం కోల్పోవాల్సి వచ్చింది.

షాబజార్‌ పాఠశాలలో విద్యార్థులకు పాఠాల బోధన

కొవిడ్‌-19 విజృంభణతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని విద్యావేత్తలు అంటున్నారు. ముఖ్యంగా నిరుపేద, గ్రామీణ ప్రాంతాలవారు చదువులో వెనకబడుతున్నారు. కరోనా వచ్చినప్పట్నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలే నిర్వహించడం లేదు. ఈసారైనా జరపాలని ప్రభుత్వం ముందుకు సాగుతున్నా.. కరోనా అడ్డుపడుతూనే ఉంది. విద్యా సంవత్సర కాలమానిని ప్రకారం సిలబస్‌ పూర్తి చేయాల్సిన గడువు ఈనెల 10తో ముగిసింది. ఇప్పటివరకు 40 శాతమైనా పూర్తి కాలేదు. సిలబస్‌ మిగలడంతో పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. సెప్టెంబరులో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినా.. పాఠశాలకు వచ్చేందుకు 10- 15 రోజులు పట్టింది. ఆ తరవాత అక్టోబరులో దసరా సెలవులు, ఎఫ్‌ఏ1 పరీక్షలు.. నవంబరులో కాస్త పరవాలేదనిపించినా.. డిసెంబరులో ఉపాధ్యాయుల బదిలీల గొడవ, జనవరిలో సంక్రాంతి సెలవులు.. ప్రస్తుతం పొడిగింపు.. దీంతో గ్రామీణ ప్రాంతాల పిల్లలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఆన్‌లైన్‌ తరగతులు సైతం వారు సక్రమంగా వినలేదు. ఫిబ్రవరి మినహాయిస్తే మళ్లీ మార్చిలో ఒంటిపూట బడులే.. ఇలా అన్నీ ఆటంకాలతో ఈ విద్యా సంవత్సరాన్ని అధిగమించేందుకు తీవ్ర ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పక్కా ప్రణాళికతో ముందుకు.. : ఈ ఏడాది జనవరి చివరి నాటికి సిలబస్‌ పూర్తి చేయాలని సూచించాం. సెలవుల పొడిగింపుతో కొంత ఇబ్బంది ఎదురైనా.. విద్యార్థుల ఆరోగ్యమే మాకు ప్రధానం. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.

- ఉషారాణి, ఉమ్మడి జిల్లా నోడల్‌ అధికారి, మహబూబ్‌నగర్‌

వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నాం..

పాఠాలు చెబుతున్నా చదువుకునేందుకు సమయం లేక ఒత్తిడి పెరిగింది. వార్షిక పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం అవుతున్నాం. నిత్యం హోంవర్క్‌తోపాటు ప్రత్యేక పాఠాలపై దృష్టి సారించాం.

- సాయిప్రియ, పదో తరగతి, మోడల్‌ బేసిక్‌ ఉన్నత పాఠశాల, మహబూబ్‌నగర్‌

భారం పెరిగింది..

పాఠాలను త్వరగా చెబుతూనే వార్షిక పరీక్షలకు ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. మాకు కష్టంగానే ఉంది. ముందుగా ప్రత్యక్ష తరగతులు ఉంటే బాగుండేది. బడుల ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఒక్కసారిగా భారం పడింది.

- బి.అశ్విని, పదో తరగతి, జడ్పీహెచ్‌ఎస్‌ కౌకుంట్ల

ప్రయత్నించాం...

సిలబస్‌ సకాలంలో పూర్తి చేయడానికి యత్నించాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ రోజు ఎంతమేర చెప్పాలో అలాగే చేశాం. ఒత్తిడికి గురవకుండా వార్షిక పరీక్షలు రాసేలా పదో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. పాఠాలు బోధించడంతోపాటు అత్యంత ప్రధానమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.

- అబ్దుల్‌హక్‌, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, జడ్పీహెచ్‌ఎస్‌ కౌకుంట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని