logo

నిరుపేదల కల్యాణం..దళారుల వైభోగం

కుమారుడు విద్యుదాఘాతంతో మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన తండ్రి మరుసటి రోజే హఠాన్మరణం చెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకొంది.

Published : 18 Jan 2022 01:47 IST

రెవెన్యూ అధికారుల పేరుతో  అడ్డగోలుగా వసూళ్లు

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌

* ధన్వాడ మండలం తోలగుట్ట తండాకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలల కిందట కుమార్తె వివాహం జరిపించారు. కల్యాణలక్ష్మి డబ్బుల కోసం దరఖాస్తు చేసుకొని ఓ యువ నాయకుడిని ఆశ్రయించారు. అతను రెవెన్యూ అధికారుల పేరుతో అప్పుడప్పుడు కలిపి ఆమె నుంచి మొత్తం రూ.40 వేల వరకు వసూలు చేశాడు. ఇటీవలే రూ.1,00116 చెక్కు వచ్చింది. దళారికి ఇచ్చింది పోగా రూ.60116 మాత్రమే మిగిలింది.

* అదే తండాకు చెందిన మరో కుటుంబంలో ఎనిమిది నెలల కిందట యువతి వివాహం చేశారు. నిరక్షరాస్యులైన వీరికి కల్యాణలక్ష్మి డబ్బు ఎలా పొందాలో తెలియక ఓ దళారీని నమ్ముకున్నారు. అతను రెవెన్యూ అధికారుల పేరుతో రూ.35 వేలు వసూలు చేశాడు. ఇటీవల లబ్ధిదారుల చేతికి చెక్కు వచ్చింది. దళారికి ఇచ్చిన డబ్బులు పోను రూ.65,116 మాత్రమే మిగిలాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

* ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లి గ్రామానికి చెందిన ఓ మైనార్టీ కుటుంబం తమ కుమార్తె వివాహం చేశారు. షాదీముబారక్‌ పథకం కోసం సమీపంలోని ఓ గ్రామ దళారీని ఆశ్రయించారు. రూ.25 వేలు ఖర్చు అవుతాయని చెప్పిన దళారీకి ముందస్తుగా రూ.పదివేలు అందజేశారు. చెక్కు వచ్చాక మిగతా రూ.15 వేలు ఇస్తారన్న నమ్మకం ఏమిటంటూ అప్పు ఇచ్చినట్లు కాగితం రాయించుకున్నాడు. ఇటీవల షాదీముబారక్‌ చెక్కు రాగా.. ఆ దళారీ అప్పు కాగితం తీయడంతో మైనార్టీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధన్వాడలోని తమ బంధువులతో మొరపెట్టుకున్నారు. చివరికి స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర పంచాయతీ నిర్వహించి అప్పు కాగితాన్ని చించి వేసినట్లు సమాచారం.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ధన్వాడ మండలంలో కల్యాణలక్ష్మి,  షాదీముబారక్‌ పథకాల్లో దళారుల భోజ్యమే అగ్రభాగం అవుతోంది. జనం  అమాయకత్వాన్ని ఆసరా చేసుకొంటున్న దళారులు దరఖాస్తు చేయడం మొదలు చెక్కు చేతికి వచ్చేవరకు వివిధ సందర్భాల్లో రెవెన్యూ అధికారులు పేరు చెప్పి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. పథకం ద్వారా అందే మొత్తంలో సుమారు 40 శాతం వరకు దండుకొంటున్నారు. ఇటీవల మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సందర్భంగా దళారీల లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి.

తహసీల్దారు దృష్టికి అక్రమాలు..

ధన్వాడలో ఈ నెల మొదటి వారం చెక్కులు పంపిణీ చేసిన రోజు రాంకిష్టాయపల్లి గ్రామానికి చెందిన మైనార్టీ కుటుంబం నుంచి ఓ దళారీ అప్పు పత్రం రాయించుకున్న విషయం వెలుగులోకి రావడంతో పలువురు లబ్ధిదారులు తాము కూడా దళారులకు ఎంతెంత ఇచ్చింది బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని వారం కిందట స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.  

రూ. లక్షలు దండుకుంటున్నారు..

ధన్వాడ మండల కేంద్రంలో ఈ నెల 5న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సుమారు 145 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. వీటి విలువ రూ.1,45,16,820. వీటిలో కనీసం రూ.30 లక్షల వరకు దళారులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో దరఖాస్తు చేయడానికి రానివారు, నిరక్షరాస్యులు ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయంలో కిందిస్థాయి ఉద్యోగి నుంచి  పైస్థాయి అధికారి వరకు మామూళ్లు ఇవ్వాల్సిందేనంటూ లబ్ధిదారులకు చెబుతూ అక్రమ దందాకు తెర తీస్తున్నారు. గత్యంతరం లేక పలువురు తమ వద్ద డబ్బులేకున్నా అప్పుచేసి ఇస్తుండగా.. మరికొందరు దళారులకే అప్పు పత్రం రాసి ఇస్తుండటం గమనార్హం.

ఫిర్యాదు చేస్తే చర్యలు..

దళారులు డబ్బులు వసూలు చేసినట్లు ఒకటి రెండు కేసులు నా దృష్టికి కూడా వచ్చాయి. డబ్బు ఇచ్చినవారు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకొని సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తాం. తీసుకున్న డబ్బు రికవరీ చేయిస్తాం.

- బాలచందర్‌రావు, తహసీˆల్దారు, ధన్వాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని