logo

కాలువలో దూకి యువతి, వివాహితుడి గల్లంతు!

వనపర్తి జిల్లా రేవెల్లి మండలం గౌరీదేవిపల్లి సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధి గుడిపల్లి జలాశయం కాలువలో ఓ యువతీ, వివాహితుడు దూకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జలాశయం ఒడ్డున వారికి సంబంధించి పాదరక్షలు,

Published : 21 Jan 2022 02:42 IST

ప్రేమను అంగీకరించలేదని చరవాణిలో సందేశం

గల్లంతైనట్లుగా భావిస్తున్న నరేశ్‌

రేవల్లి, కల్వకుర్తి పట్టణం, న్యూస్‌టుడే : వనపర్తి జిల్లా రేవెల్లి మండలం గౌరీదేవిపల్లి సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధి గుడిపల్లి జలాశయం కాలువలో ఓ యువతీ, వివాహితుడు దూకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జలాశయం ఒడ్డున వారికి సంబంధించి పాదరక్షలు, చరవాణి ఉండటం, చరవాణిలో తాము చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాయడంతో పోలీసులు కాలువలో గాలింపులు చర్యలు చేపట్టారు. చరవాణిలో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు ఆ యువతీ కల్వకుర్తి పట్టణానికి చెందిన విద్యార్థిని (17)గా, వివాహితుడు నరేశ్‌ (25) నాగర్‌కర్నూల్‌కు చెందినవాడుగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విద్యార్థిని, నరేశ్‌ బుధవారం గుడిపల్లి జలాశయం వద్దకు వచ్చారు.

శివాలయంలోని శివమాలధారులు వారిని గమనించి వివరాలు అడగ్గా రిజర్వాయర్‌ చూడటానికి వచ్చామన్నారు. తరవాత వెళ్లిపోయిన వారు గురువారం ఉదయం 11 గంటల సమయంలో మళ్లీ జలాశయం వద్ద కనిపించారు. మాలధారులు మధ్యాహ్నం గ్రామంలోకి వెళ్లి వచ్చేసరికి జలాశయం ఒడ్డున పాదరక్షలు, వాచీలు, చరవాణి కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. రేవల్లి ఎస్సై శ్రీనివాసులు వెంటనే సిబ్బందితో వచ్చి చరవాణి పరిశీలించగా అది యువతి ఫోన్‌గా తేలింది. తామిద్దరం నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించడం లేదని, ఈ విషయమై కొట్టారని, మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వచ్చేయగా ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని, అందుకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు సమాచారం పంపినట్లు అందులో ఉంది. దీంతో వెంటనే గజ ఈతగాళ్లు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8 గంటల వరకు ఆచూకీ దొరకలేదు. గాలింపు చర్యలు ఆపేశారు. ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని ఎస్సై తెలిపారు. యువకుడు నరేశ్‌కు 6 ఏళ్ల కిందటే వివాహం కాగా ఆరు నెలల పాప కూడా ఉంది. అతని వెంట ఉన్న యువతి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని కాగా, అతనికి సమీప బంధువు.

చరవాణిలో లేఖ

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..  : గుడిపల్లి జలాశయం కాలువలో గల్లంతైన యువతి ఈ నెల 13న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని కల్వకుర్తి ఠాణాలో తల్లిదండ్రులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. వరుసకు బావయ్యే నరేశ్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. బాలిక అపహరణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు రోజులుగా వారి చరవాణిల వివరాలు తెలుసుకుని ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నామని కల్వకుర్తి ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని