logo

రహదారులపై మృత్యుహేళ

వారంతా సమీప బంధువులు. ఒకరి ఇంట్లో ఇటీవలే శుభకార్యం జరిగింది. మరొకరికి మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు. దీంతో అంతా మంచి జరగడంతో శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు వెళ్దామని నిర్ణయించుకుని సోమవారం

Updated : 25 Jan 2022 02:25 IST

వివిధ ప్రాంతాల్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వాహనాలు అదుపుతప్పి, అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుని అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. ఎనిమిది మంది గాయపడ్డారు.


సంతోషంగా ప్రయాణం.. అంతలోనే విషాదం

చెట్టును ఢీకొన్న కారును పరిశీలిస్తున్న పోలీసు సిబ్బంది

కల్వకుర్తి పట్టణం : వారంతా సమీప బంధువులు. ఒకరి ఇంట్లో ఇటీవలే శుభకార్యం జరిగింది. మరొకరికి మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు. దీంతో అంతా మంచి జరగడంతో శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు వెళ్దామని నిర్ణయించుకుని సోమవారం ఉదయం ఆరుగురు కలిసి కారులో రంగారెడ్డి జిల్లా బాల్‌నగర్‌ నుంచి బయలుదేరారు. ప్రయాణం సంతోషంగా సాగుతుండగా జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన శ్రీరాములు (28) అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా బాల్‌నగర్‌ మండలం అమ్మపల్లికి చెందిన సుధాకర్‌, శంషాబాద్‌ మండలం నడికూడ గ్రామానికి చెందిన గణేశ్‌, మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన ఉపేందర్‌, అరవింద్‌, అమీర్‌పేట్కు చెందిన శ్రీరాములు, జడ్చర్ల మండలం లింగంపేటకు చెందిన మహేశ్‌ కలిసి కారులో శ్రీశైలం బయలుదేరగా అతి వేగం కారణంగా కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జై అందరూ అందులోనే ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు. ఈలోగా శ్రీరాములు తీవ్ర గాయాలతో అక్కడికి అక్కడే మృతిచెందారు. కారును నడుపుతున్న సుధాకర్‌ మినహా మిగిలినవారి కాళ్లూ చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌ పంపారు. శ్రీరాములుకు ఏడాది క్రితం వివాహమవగా 21 రోజుల క్రితమే కొడుకు పుట్టినట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఆటో బోల్తాపడి డ్రైవర్‌..  
వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వనపర్తి గ్రామీణ ఠాణా ఎస్సై చంద్రమోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన బాలరాజు (43) గ్రామానికి చెందిన కూలీలను ఆటోలో ఎక్కించుకుని పొలానికి వస్తుండగా గ్రామ సమీపంలోనే ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఆటోను నడుపుతున్న బాలరాజు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పెంటమ్మ అనే మహిళకు చేతిపై తీవ్ర గాయమైంది. వీరిద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన మృతిచెందాడు. మరో మహిళ వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య జయమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


చిట్యాలలో ప్రమాదానికి గురైన ఆటో

వంగూరు మండలంలో..
వంగూరు, న్యూస్‌టుడే : శ్రీశైలం - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై వెలుమలపల్లి స్టేజీ వద్ద ఓ వ్యక్తి  గుర్తు తెలియని ద్విచక్ర వాహనం తగిలి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై కురుమూర్తి కథనం ప్రకారం.. వంగూరు స్టేజీకి చెందిన దుళ్ల బాల్‌రాం (67) ఆదివారం ఉర్సు షరీఫ్‌ ఉత్సవాలకు వచ్చి తిరిగి వెళ్తుండగా వెలుమలపల్లి స్టేజీ వద్ద బైక్‌ దిగి వస్తుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనం అతివేగంగా వచ్చి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 ద్వారా వెంటనే కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని